Saturday, May 4, 2024

Adilabad Meeting – ‘కాంగ్రెస్ 420 హామీలు’ బుక్ లెట్ ను విడుద‌ల చేసిన బిఆర్ఎస్ పార్టీ

హైదరాబాద్‌: ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై భారాస దృష్టి సారించింది. హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆలస్యం చేస్తోందంటూ ప్రజలకు గుర్తు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ‘కాంగ్రెస్ 420 హామీలు’ పేరుతో బుక్‌లెట్‌ను విడుదల చేసింది. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ రాక ముందే మాటకు కట్టుబడి హామీలను నెరవేర్చాలని పేర్కొంది.

లోక్‌సభ ఎన్నికల సన్నాహాక సమావేశాల్లో భాగంగా తెలంగాణ భవన్ లో నేడు ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వ‌హించారు… ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ మీటింగ్ లో కె కెశ‌వ‌రావు, హ‌రీష్ రావు, క‌డియం శ్రీహ‌రి, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి, పోచారం మ‌ధునాచారి, అలోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, బి వినోద్ కుమార్, జోగు రామ‌న్న త‌దిత‌రులు పాల్గొన్నారు..

ఈ స‌మావేశంలో అలాగే ఇటీవల విడుదల చేసిన ‘స్వేదపత్రం’ ప్రతిని కూడా నేతలకు పార్టీ అందించింది. తొమ్మిదిన్నరేళ్లలో కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, వాటి ద్వారా కలిగిన లబ్ధిని వివరిస్తూనే.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడిపై పెంచేలా ప్రణాళికలు రూపొందించింది. కాంగ్రెస్‌ హామీలు అమలులో ఆలస్యం తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేసింది.

ఈ సమావేశంలో నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement