Thursday, May 2, 2024

Winter Season – ప‌గ‌లు మంట‌లు…రాత్రుళ్లు చ‌లిగాలులు…

హైదరాబాద్ నగరంలో సాధారణంగా అక్టోబర్ నెలలో చలి మొదలవుతుంది. అయితే ఈ ఏడాది మాత్రం వింత పరిస్థితి నెలకొంది. అక్టోబర్ చివరి వారం వచ్చినప్పటికీ.. పగటిపూట ఎండలు దంచికొడుతున్నాయి. రాత్రిపూట ఊష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో నగర ప్రజలు చలికి వణుకుతున్న.. పగులు మాత్రం వేసవిని తలపిస్తుంది. దీంతో హైదరాబాద్‌లో పగలు ఎండ.. రాత్రి చలి అనే విధంగా పరిస్థితి ఉంది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్‌డీపీఎస్) నివేదిక ప్రకారం.. నగరంలోని చాలా ప్రాంతాల్లో పగలు ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు అవుతున్నాయి.

అయితే రాత్రి వేళలో మాత్రం నగరంలో చలి చంపేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌ ప్రాంతంలో గత రాత్రి కనిష్టంగా 13.2 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రోజుల్లో హైదరాబాద్‌లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. పగటి ఉష్ణోగ్రత కూడా త్వరలో తగ్గే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

ఇదిలాఉంటే, తెలంగాణలో చలి మొదలైంది. అక్టోబర్ మొదలైనప్పటికీ ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ ప్రజలు.. గత ఐదారు రోజుల నుంచి ఊష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. అయితే నైరుతి రుతుపవనాలు తిరుగుముఖం పట్టడంతో రాష్ట్రం వైపు శీతల గాలులు వీయడం చలి ప్రభావం ప్రారంభమైంది. ఇప్పటికే ఉత్తర తెలంగాణలోని పల్లెలు చలితో గజగజ వణకడం ప్రారంభించాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ కాశ్మీర్ గా పిలిచే ఆదిలాబాద్ లో ఇప్పుడే చలి తన పంజా విసరడం ప్రారంభించింది. అలాగే పలు ప్రాంతాల్లో పగటి పూట ఊష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. హ‌నుమ‌కొండ‌లో రాత్రి ఉష్ణోగ్ర‌త‌లు ఆరు డిగ్రీల‌కు ప‌డిపోయింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement