Wednesday, May 8, 2024

రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందిస్తాం.. స్పీక‌ర్ పోచారం

గ‌త రెండు రోజులుగా నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల్లో అకాల వర్షం, భారీగా వడగల్లు పడడంతో.. సాగుచేసిన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని గ్రామాల్లో వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలను బుధవారం సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ప్రతి ఏడాది వేసవిలో వడగళ్ల వర్షంతో సాగు చేసిన పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతిని ఎవరు ఆపలేమని కానీ ప్రకృతి నుంచి తప్పించుకునే ప్రయత్నం రైతులు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. పంట దెబ్బతిన్న రైతులు అధైర్య పడకుండా ధైర్యంగా ఉండాలని గత ఏడాది పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించామన్నారు. గత నెల రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలతో పలు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయని..ఆ పంటలను ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా పరిశీలించారని గుర్తు చేశారు.

దెబ్బతిన్న పంటలకు ఎకరాకు వెంటనే పదివేల రూపాయలు చెల్లించాలని కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని సభాపతి తెలిపారు. పంట నష్టపోయిన రైతు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో నాకు బాగా తెలుసు అని తాను ఒక రైతు బిడ్డగా పంట సాగులో ఎన్నోసార్లు నష్టాలను చవిచూశానని సభాపతి అన్నారు. బాన్సువాడ మండలంలోని తాడ్కోలు కోయగుట్ట మోగలాంపల్లి తదితర గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను పోచారం పరిశీలించారు. వ్యవసాయ అధికారులు రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సర్వే జరిపి పంట నష్టం పై ప్రాథమిక అంచనాలు వెంటనే ప్రభుత్వానికి పంపించాలని సభాపతి అధికారులను ఆదేశించారు. పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ప్రయత్నం చేస్తానని రైతులకు భరోసా ఇచ్చారు. కళ్ళల్లో తడిసిన ధాన్యాన్ని వెంటనే కాంటాలు వేయాలని, కాంట వేసిన దాన్ని బస్తాలను వెంటనే మిల్లులకు తరలించాలని అధికారులకు సభాపతి ఆదేశాలు జారీ చేశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి వెంట రైతుబంధు జిల్లా అధ్యక్షులు అంజిరెడ్డి ఆర్డీవో రాజా గౌడ్, వ్యవసాయ రెవెన్యూ శాఖ అధికారులు పలువు రైతులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement