Monday, May 20, 2024

తహసీల్దార్‌ ఆఫీసులో వీఆర్‌ఏ దారుణ హత్య.. ఎంతటివారినైనా వదిలిపెట్టమన్న ఏసీపీ

బెల్లంపల్లి/కన్నెపల్లి, ప్రభన్యూస్‌: బెల్లంపల్లి నియోజకవర్గం కన్నెపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో వీఆర్‌ఏగా విధులు నిర్వహిస్తున్న కొత్తపల్లికి చెందిన దుర్గం బాపు (55) కార్యాలయంలోనే హత్య గురైన ఉదాంతం సోమవారం మండల కేంద్రంలో కలకలం సృష్టించింది. స్థానికులు కార్యాలయానికి వద్ద ఉన్న పంపు నీళ్లు పట్టుకునేందుకు రావడంతో తలుపులు తీసితీయనట్లు ఉండటంతో అనుమానం వచ్చి తలుపులు తీసి చూడగా వీఆర్‌ఏ బాపు హత్యకు గురైనట్లు గమనించి వెంటనే సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలపై ఆరా తీసి పై అధికారులకు సమాచారం అందజేసిన వెంటనే సంఘటనా స్థలానికి ఏసీపీ ఎడ్ల మహేష్‌, సీఐ కోట బాబురావు, ఎస్సై సురేష్‌ చేరుకొని పరిశీలన చేపట్టి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బెల్లంపల్లి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి నైట్‌ డ్యూటీ కోసం ఇద్దరు వీఆర్‌ఏలు విధులు నిర్వర్తించాల్సి ఉండగా దుర్గం బాపు ఒక్కడే విధులకు హాజరై విధి నిర్వాహణలో ఉన్న బాపుపై అర్దరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కార్యాలయంలో చోరబడి కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు వెల్లడించారు.

హత్య ఉదాంతం చూసుకుంటే పాత కక్షలే ఉన్నట్లు కుటుంబసభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. హత్య చేసిన దుండగలను పట్టుకునేందుకు డాగ్‌ స్వ్కాడ్‌ బృంధం, క్లూస్‌ టీమ్‌ సభ్యులు తనిఖీలు చేపట్టారు. త్వరలోనే దుండగులను పట్టుకోవడానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని ఏసీపీ వెల్లడించారు. వీఆర్‌ఏ హత్య విషయం తెలుసుకున్న ఆర్డీఓ శ్యామలాదేవి కార్యాలయానికి చేరుకొని వివరాలను అడిగి తెలుసుకొని బాధిక కుటుంబ సభ్యులతో మాట్లాడారు. హత్యకు గల కారణాలు అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

హంతకులు ఎంతటి వారైనా శిక్ష తప్పదు: ఏసీపీ ఎడ్ల మహేష్‌
విధుల్లో ఉన్న ఉద్యోగిని హత్య చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష తప్పదని ఏసీపీ ఎడ్ల మహేష్‌ వెల్లడించారు. ఆదివారం రాత్రి మండల కేంద్రంలోని తహశిల్దార్‌ కార్యాలయంలో జరిగిన వీఆర్‌ఏ హత్య విషయం తెలుసుకున్న ఏసీపీ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. హత్యకు సంబంధించి అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నామని, హత్యకు పాల్పడిన దుండగలను అతిత్వరలోనే పట్టుకుంటామని, వారు ఎంతటి వారైనా వారికి తగిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement