Monday, June 24, 2024

Polling Day – ఫిఫ్త్ ఫేజ్ పోలింగ్ ప్ర‌శాంతం … సుమారు 62 శాతం ఓటింగ్

ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు..
49 లోక్​స‌భ స్థానాల‌కు పోలింగ్​
ఉద‌యం నుంచే ఓట‌ర్లు బారులు
పోలింగ్ కేంద్రాల్లో సంద‌డి
బ‌రిలో నిలిచిన ప‌లువురు ప్ర‌ముఖులు
రాహుల్ గాంధీ, స్మృతి ఇరానీ, రాజ్‌నాథ్,
ఓమ‌ర్ అబ్డుల్లా, పీయూష్ గోయల్
ఓటు హ‌క్కు వినియోగించుకున్న సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు

- Advertisement -

లోక్ స‌భకు మొత్తం ఏడు ద‌శ‌ల‌లో ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే నాలుగు ద‌శ‌ల‌ పోలింగ్ పూర్తి అయ్యింది. తాజాగా అయిదో ద‌శ పోలింగ్ నేడు ఉద‌యం ఏడు గంట‌ల‌కు ప్రారంభ‌మైన ఓటింగ్ ప్ర‌క్రియ సాయంత్రం ఆరు గంట‌ల‌కు ముగిసింది.. అధికారులు అందించిన స‌మాచారం ప్ర‌కారం సుమారు 62 శాతం ఓటింగ్ న‌మోదైంది.. పూర్తి ఓటింగ్ వివరాల‌ను నేటి రాత్రికి తెలీయ‌జేస్తామ‌ని ఎన్నిక‌ల సంఘం ప‌క‌టించింది.

. కాగా మొత్తం ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు పోలింగ్ నేడు ముగిసింది. జమ్ము క‌శ్మీర్, లడఖ్‌తో పాటు ఉత్తర్ ప్రదేశ్‌లో 14 స్థానాలు, మహారాష్ట్రలో 13, పశ్చిమ బెంగాల్‌లో 07, ఒడిశాలో 05, బీహార్‌లో 05, జార్ఖండ్‌లో 03 ఎంపీ స్థానాలు అయిదో ద‌శ పోలింగ్ లో ఉన్నాయి. మొత్తం 695 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ప్రజలు ఈవిఎంల‌లో నిక్షిప్తం చేశారు..

బ‌రిలో హేమాహేమీలు

లోక్‌స‌భ ఎన్నిక‌ల బ‌రిలో హేమాహేమీలు ఉండడం రాజకీయప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ కంచుకోట రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ గాంధీ, అమేధి నుంచి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, రాజధాని లఖ్‌నవూ నుంచి మూడోసారి బరిలోకి దిగుతున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, శరణ్‌ (బిహార్‌)లో బీజేపీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ, హాజీపూర్‌లో రాంవిలాస్‌ పాసవాన్‌ కుమారుడు చిరాగ్‌ పాసవాన్‌ వంటివారు ఈ దశలో పోటీపడుతున్న ప్రముఖుల జాబితాలో ఉన్నారు.

బీజేపీకి కీల‌కం
49 స్థానాల్లో ఎన్డీయే, ఇండియా కూటమికి మధ్య పోటీ హోరాహోరీ సాగుతుండడంతో ఐదో దశ బీజేపీకి కీలకంగా మారింది. ముఖ్యంగా మహారాష్ట్ర, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లోని 39 స్థానాలు బీజేపీకి అగ్నిపరీక్షగా మారాయి. కీలక నియోజకవర్గాల వారీగా చూస్తే.. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ గత ఎన్నికల్లో పోటీ చేసిన రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి ఈసారి ఆమె తనయుడు రాహుల్‌ గాంధీ రంగంలోకి దిగారు.

హోరాహోరీ..
రాహుల్‌ గతంలో పోటీ చేసిన అమేధి నుంచి గాంధీ కుటుంబ విధేయుడు కేఎల్‌ శర్మ.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఢీకొంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ-కాంగ్రెస్‌ కూటమి రాజకీయంగా బలం పుంజుకున్న రీత్యా ఈ రెండు నియోజకవర్గాల్లోనే కాక ఎన్నికలు జరుగుతున్న 14 నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు జరిగే అవకాశాలున్నాయి.

ల‌క్నోలో కేంద్ర మంత్రి రాజ‌నాథ్ సింగ్
మహిళా అథ్లెట్‌లపై లైంగిక అత్యాచారాలకు పాల్పడ్డట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత కుస్తీ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌కు ఈసారి కైసర్‌గంజ్‌ నుంచి బీజేపీ టికెట్‌ ఇవ్వకుండా ఆయన కుమారుడిని రంగంలోకి దించింది. అయోధ్య రామమందిరం కొలువై ఉన్న ఫైైజాబాద్‌ నియోజకవర్గంలో బీజేపీ నేత లల్లూ సింగ్‌, ఎస్పీ నేత అవధేశ్‌ ప్రసాద్‌ మధ్య పోటీ బలంగా ఉన్నట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. లఖ్‌నవూలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఎస్పీ నేత రవిదాస్‌ మెర్హోత్రా మధ్య ప్రధానంగా పోటీ ఉంది.

మరాఠా గడ్డపై…

అయిదో దశలో బీజేపీకి అత్యంత కీలకమైన మహారాష్ట్రలో 14 స్థానాల‌కు కమలనాథులకు ప్ర‌తిష్టాత్మ‌కంగా మారాయి. ముంబై మెట్రోపాలిటన్‌ ప్రాంతంలోనే కనీసం ఏడు స్థానాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. రెండుగా చీలిపోయిన శివసేన, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీలలో ఎవరిది నిజమైన పార్టీగా ప్రజలు గుర్తిస్తారో ఈ ఎన్నికలలో తేలనుంది. కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌తో సహా పలువురు బీజేపీ నేతలు ఈ ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి తమ భవితవ్యం తేల్చుకోనున్నారు.

బీహార్ లో లాలూ కూతురు
కాగా, ఈ దశలో బిహార్‌లో 5 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమార్తె రోహిణీ ఆచార్య.. బీజేపీ దిగ్గజం రాజీవ్‌ ప్రతాప్‌ రూడీకి గట్టి పోటీ ఇస్తున్నారు. లోక్‌జనశక్తి నేత చిరాగ్‌ పాసవాన్‌ హాజీపూర్‌లో ఎన్డీయే తరఫున పోటీ చేస్తుండగా.. ఆయన ప్రత్యర్థిగా లాలూ కుడిభుజం శివ చంద్రరామ్‌ బరిలో ఉన్నారు.

జార్ఖండ్ లో య‌శ్వంత్ సిన్హా కుమారుడు
లాగే.. జార్ఖండ్ హజారీబాగ్‌, కొడెర్మా, ఛత్రా సీట్లను గత ఎన్నికల్లో బీజేపీ గెలుచుకుంది. హజారీబాగ్‌లో కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా కుమారుడు జయంత్‌ సిన్హా గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించినప్పటికీ ఈసారి బీజేపీ ఆయనకు టికెట్‌ కేటాయించలేదు. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలు జరుగుతున్న గాండే అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ సతీమణి కల్పనా సోరెన్‌ జేఎంఎం నుంచి పోటీ చేస్తుండగా ఆమెకు ప్రత్యర్థిగా బీజేపీ దిలీప్‌ వర్మ అనే స్థానికుడిని రంగంలోకి దింపింది.

బారాముల్లాలో ఒమ‌ర్ అబ్దుల్లా ..
పశ్చిమబెంగాల్‌లో అత్యంత కీలకమైన హూగ్లీ, హౌరా, ఆరాంబాగ్‌, సేరంపూర్‌, బంగాన్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌- బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. ఆ రాష్ట్రంలో 57.19 శాతం పైగా పోలింగ్‌బూత్‌లను సున్నితమైనవిగా ఈసీ గుర్తించడంతో అక్కడ భారీగా కేంద్ర బలగాలను దించారు. ఇటు ఒడిసాలో ఐదో దశలో పోలింగ్‌జరిగే 5 స్థానాలనూ బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ఈ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న నేతల్లో 13 మంది కోట్లకు పడగెత్తినవారేనని ఏడీఆర్‌ తన నివేదికలో పేర్కొంది.ఇక జమ్ముకశ్మీర్‌లో బారాముల్లా నుంచి నేషనల్‌ కాన్ఫరెన్స్‌ తరఫున మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా బరిలో ఉన్నారు.

ఓటేసిన‌ సినీ సెల‌బ్రిటీస్..

ముంబైలోని ఏడు లోక్ స‌భ స్థానాల‌కు ఇవాళ పోలింగ్ కొన‌సాగుతుంది. తొలి గంట‌లోనే సినీ సెల‌బ్రిటీస్‌ త‌మ ఓటు హక్కును వినియోగించుకున్నారు. షారూక్ ఖాన్, స‌ల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అక్ష‌య్ కుమార్ , రాజ‌కుమార్ రావు, మ‌నోజ్ బాజ్‌పాయ్‌, ధ‌ర్మేంద్ర‌, హేమమాలిని , జాన్వీ కపూర్, శ్రీయా శ‌ర‌ణ్. క‌రీనాక‌పూర్, ర‌ణ‌వీర్ సింగ్, సైఫ్ అలీఖాన్,దీపికా ప‌డుకోనే,స‌చిన్ టెండుల్క‌ర్ త‌దిత‌రులు ఓటు వేసిన వారిలో ఉన్నారు. ఇక బిఎస్పీ అధినేత్రి మాయావ‌తి, కేంద్ర‌మంత్రులు రాజ‌నాథ్ సింగ్, ప్ర‌పుల్ ప‌టేల్ . ఓమ‌ర్ అబ్దుల్లా త‌దిత‌రులు త‌మ ఓటు హ‌క్కుని వినియోగించుకున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement