Tuesday, April 30, 2024

TS: దక్షిణభారత కుంభమేళాగా మేడారం.. అన్ని ఏర్పాట్లు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

ఉమ్మడి వరంగల్‌, ప్రభన్యూస్‌ బ్యూరో : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర దక్షణ భారత దేశ కుంభమేళ మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర అని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. 2022 ఫిబ్రవరి మూడవవారంలో జరిగే మేడారం సమ్మక్క జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల నుంచి కోటి మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తుందని సత్యవతి రాథోడ్‌ స్పష్టం చేశారు. శనివారం మేడారం సమ్మక్క-సారలమ్మ వనదేవతలను దర్శించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్‌, ములుగు ఎమ్మెల్యే సీతక్కతోకలిసి మేడారం అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత జాతరలో జరిగినటువంటి లోపాలను గుణపాఠాలుగా తీసుకొని వచ్చేజాతరలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ముందు చూపుతో అభివృద్ధి పనులను ప్రతిపాదనలు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే వివిధ శాఖల ద్వారా 120 కోట్ల ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి అందాయని, త్వరలో వాటిని మంజూరు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. గత జాతరకు 75 కోట్ల రూపాయలను మంజూరు చేయగా, కొన్ని శాశ్వత పనులను, నిర్మాణాలను చేపట్టడం జరిగిందన్నారు. ఈ సారి జాతరలో కూడా మరికొన్ని శాశ్వత నిర్మాణ పనులుచేపట్టే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేశామని, త్వరలోనే వాటిని ప్రారంభించి జాతర నాటికి పూర్తిచేస్తామని మంత్రి తెలిపారు. కరోనా పూర్తిగా నశించిపోవాలని అమ్మవార్లను వేడుకోవడం జరిగిందని, జాతర నాటికి కరోనా లేకుండా ఉంటుందని మంత్రి సత్యవతి ఆశాభావం వ్యక్తం చేశారు. జాతరకు వచ్చే అన్ని ప్రధాన రహదార్లను అభివృద్ధి చేసేవిధంగా ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా ప్రతిపాదనలను సిద్ధం చేశామన్నారు.

గత జాతర సమస్యలు పునరావృతం కావొద్దు. ములుగు ఎమ్మెల్యే సీతక్క
గత జాతరలో ఎదురైన సమస్యలు ఈసారి జరిగే జాతరలో పునరావృతం కాకుండా ముందస్తుగానే అభివృద్ధి పనులు చేపట్టి పూర్తిచేయాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క సూచించారు. ప్రధానంగా రహదార్లను అభివృద్ధి చేస్తే ట్రాఫిక్‌ సమస్యను నివారించవచ్చన్నారు. అదేవిధంగా తిరుగువారం జాతరకు ఏర్పాట్లపైన కూడా దృష్టిసారించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తిచేశారు. సమీక్షా అనంతరం 2,24 కోట్ల అభివృద్ధి పనులకు కమ్యూనిటీ, డైనింగ్‌ హాల్‌ షెడ్డు, ఓహెచ్‌ఆర్‌ఎస్‌, విశ్రాంతి గదులు, బట్టలు మార్చుకునే గదులు, సులబ్‌కాంప్లెక్స్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సమీక్షా సమావేశంలో ములుగు జిల్లా జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ బడే నాగజ్యోతి, కలెక్టర్‌ కృష్ణఆదిత్య, అదనపు కలెక్టర్‌ ఐలాత్రిపాఠి, ఎస్పీసంగ్రామ్‌సింగ్‌ పాటిల్‌, ఆర్డీఓ కె. రమాదేవి, డీఎంహెచ్‌ఓ అల్లెం అప్పయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement