Friday, April 26, 2024

టీఆర్ఎస్‌ సంస్థాగత నిర్మాణం పూర్తైంది.. ప్లీన‌రీ ఎప్పుడంటే..

ప్ర‌భ న్యూస్‌, హైదరాబాద్: టీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణం పూర్తి అయ్యింద‌ని.. విలేజ్‌ నుంచి సిటీ దాకా అన్ని కమిటీలు ఏర్పాటు చేసుకున్నామని పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో బుధ‌వారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందన్నారు. వచ్చే నెలరోజుల్లో వ్యాక్సినేషన్ పూర్తి అవుతుందన్నారు. అక్టోబర్ 25న టీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ మీటింగ్ హెచ్ఐసీసీలో సమావేశం ఉంటుందన్నారు. పార్టీ అధ్యక్షుడిని ఆ రోజు ఎన్నుకుంటామ‌ని చెప్పారు. ఎన్నికల కమిషన్‌కు లోబడి ఈ ఎన్నిక జ‌రుగుతుంద‌ని కేటీఆర్ చెప్పారు. అక్టోబర్ 15న నామినేషన్ ప్రక్రియ, అదే రోజు స్వీకరణ ఉంటుందన్నారు.

23వ తేదీన నామినేషన్ స్క్యూటిని, నామినేషన్ ఉపసంహరణ ఉంటుంద‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. 25న టీఆర్‌ఎస్ పార్టీ ఫ్లీనరీ జరుగుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘అక్టోబర్ 17న టీఆరెస్ పార్టీ ఎల్పీ సమావేశం ఉంటుంది. తెలంగాణ అతిచిన్న వయసున్న రాష్ట్రం అయినా తనదైన ముద్ర దేశంలో సాధించింది. నవంబర్ 15న తెలంగాణ విజయ గర్జన పేరుతో వరంగల్‌లో బహిరంగ సభ నిర్వహిస్తాం. సభకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సభ్యులు లక్షలాది మంది వస్తారు. అక్టోబర్ 27న రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తాం. నవంబర్ 15 త‌ర్వాత‌ పార్టీ జిల్లా ఆఫీస్‌లు ప్రారంభ కార్యక్రమాలుంటాయి. కొత్తగా ఎన్నికైన అధ్యక్షులు జిల్లా అధ్యక్షులను ఎన్నుకుంటారు’’ అని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement