Tuesday, March 26, 2024

..ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నంతకాలం న్యాయం జరగదు: రాహుల్ గాంధీ

ప్ర‌భ న్యూస్‌, న్యూఢిల్లీ: లఖింపూర్ ఘటనలో నిందితుడి తండ్రి అజయ్ మిశ్రా మంత్రిగా ఉన్నంతకాలం.. బాధితులకు న్యాయం జరగదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ ఘటనలో బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ఆయన బుధ‌వారం కాంగ్రెస్ నాయకులతో కలిసి రాష్ట్రపతిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

‘చనిపోయిన రైతుల కుటుంబాలతో మేము మాట్లాడాం. వాళ్లు రెండు విషయాలు కోరుకుంటున్నారు. మొద‌టిది న్యాయం జరగాలని, రెండోది నిందితుడి తండ్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి త‌ప్పించాల‌ని అడుగుతున్నారు. ఈ హత్యలు చేసిన వారికి శిక్ష పడాలని బాధిత కుటుంబాలు కోరుకుంటున్నాయి. హత్యకు పాల్పడిన వ్యక్తి తండ్రి దేశ హోంశాఖ సహాయమంత్రి. ఆయన ఆ పదవిలో ఉన్నంత దాకా సరైన దర్యాప్తు జరగదు, న్యాయం జరగదు. ఈ విషయాలనే రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు విన్నవించాం. ఇది కేవలం బాధితుల కుటుంబీకుల గళం మాత్రమే కాదు. రైతులందరిది. ఈ ఘ‌ట‌న‌పై ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో విచారణ జరిపించాలని రాష్ట్రపతిని కోరాం’ అని రాహుల్ అన్నారు.

చట్టాలకు బీజేపీ నేతలు అతీతులన్నట్లు కేంద్రం వ్యవహరిస్తోంది: ప్రియాంక గాంధీ
‘లఖింపూర్ బాధిత కుటుంబసభ్యులు న్యాయాన్ని కోరుకుంటున్నారు. సిట్టింగ్ జడ్జ్‌లతో నిష్పాక్షిక విచారణ జరిపించాలి. నేరం చేసిన వ్యక్తి తండ్రి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి. ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలి. పదవి నుంచి ఆయ‌న‌ను తొలగించనంతవరకు నిస్పక్షపాతంగా విచారణ జరగదని బాధిత కుటుంబాలు భావిస్తున్నాయి. అమరులైన రైతులు, జర్నలిస్టు కుటుంబాలతోపాటు.. ఉత్తరప్రదేశ్ ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నది కూడా ఇదే. దేశంలో న్యాయం లభిస్తుందన్న ఆశాజ్యోతి ఎప్పటికీ ఆరిపోకూడదు. పేదలు, దళితులు, రైతులు, మహిళలకు న్యాయం లభించదని కేంద్ర ప్రభుత్వం సంకేతాలనిస్తోంది. అధికారంలో ఉన్న బీజేపీ నేతలు చట్టాలకు అతీతులన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. చ‌నిపోయిన‌ రైతుల కుటుంబాల తరపున రాష్ట్రపతిని కలిశాం. వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. ప్రభుత్వంతో చర్చిస్తానని రాష్ట్రపతి మాకు హామీ ఇచ్చారు’ అని ప్రియాంక అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement