Sunday, May 12, 2024

ఇది తమిళిసై సమస్య కాదు.. గవర్నర్ ఆఫీస్‌కి జరుగుతున్న అవమానం.. హోంమంత్రి అమిత్‌షాతో తమిళిసై భేటీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న తనను బీజేపీ నేత అని ఎలా అనగలుగుతున్నారని తెలంగాణా రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ప్రశ్నించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆమె బుధవారం ప్రధానమంత్రితో, గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై హోంమంత్రికి వివరణ ఇచ్చారు. అమిత్‌షాకు గవర్నర్ తమిళిసై నివేదిక అందజేసినట్లు సమాచారం. హోంమంత్రితో సమావేశం అనంతరం ఆమె తెలంగాణా భవన్‌లోని శబరి బ్లాక్ వద్ద మీడియాతో మాట్లాడారు. పుదుచ్చేరి సహా అనేక అంశాలపై అమిత్ షాతో చర్చించానని చెప్పుకొచ్చారు. తాను ఎప్పుడూ నిర్మాణాత్మకంగా ఆలోచిస్తానని, తెలంగాణ ప్రజల కోసమే పని చేస్తానని నొక్కి చెప్పారు. భద్రాచలం రాముడి దర్శనానికి రోడ్డు మార్గంలోనే వెళ్తానని, సమ్మక్క-సారక్కకు దర్శించుకోవడానికి కూడా రోడ్డు మార్గంలోనే వెళ్ళానని చెప్పుకొచ్చారు. సమ్మక్క సారక్క దగ్గర తానేమీ అనలేదని, స్థానిక ఎమ్మెల్యే సీతక్క గుర్తించి ఈ అంశాన్ని లేవనెత్తారని వివరించారు.

తాను అన్ని పార్టీల నేతలను కలిశానని, ఇంకా చెప్పాలంటే బీజేపీ నేతలను ఒకట్రెండు సార్లు మాత్రమే కలిశానని వెల్లడించారు. ఏదన్నా ఉంటే నన్ను అడగండి, నేను సమాధానం చెబుతానన్న తమిళిసై అలాగే సీఎస్, డీజీపీ, ఇతర అధికారులను వచ్చి వివరణ ఇవ్వవలసినదిగా అభిప్రాయపడ్డారు. గణతంత్ర వేడుకలకు వారు ఎందుకు రాలేదు? ఉగాది వేడుకలకు ఎందుకు రాలేదు? ఇదేనా మర్యాద? అని ఆమె తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు. సీఎం సహా అందరినీ ఆహ్వానించాననడానికి ఆధారాలు చూపిస్తానని గవర్నర్ వ్యాఖ్యానించారు. ఇది తమిళిసై సమస్య కాదు, గవర్నర్ ఆఫీస్‌కి జరుగుతున్న అవమానమని ఆవేదన వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement