Sunday, May 19, 2024

TS | అప్పుడు ప్రేక్షక పాత్ర వహించింది కాంగ్రెస్​ పార్టీనే: అసెంబ్లీలో సీఎం కేసీఆర్​

చంద్రబాబు హ‌యాంలో పత్రిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ మౌనంగా, ప్రేక్షకపాత్ర వహించిందని సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీలో నాలుగో రోజు తెలంగాణ ఆవిర్భావం, సాధించిన ప్రగతిపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడారు. ‘‘తెలుగు దేశం హయాంలో తెలంగాణలో పరిస్థితులు మరింత దిగజారాయి. ఆనాడు స్పీకర్‌ స్థానంలో కూర్చున్న వ్యక్తి.. ప్రణయ్‌ భాస్కర్‌ అనే ఎమ్మెల్యే తెలంగాణ అంటే.. నో నో తెలంగాణ అనే పదం వాడకూడదని రూలింగ్‌ ఇచ్చిన సందర్భం ఉంది. ఆ రోజు కూడా కాంగ్రెస్​ ప్రేక్షకపాత్ర పోషించింది. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వీళ్ల నోళ్లు మెదలలేదు. చివరకు చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో సంస్కరణల ముసుగులో విద్యుత్‌ చార్జీలను పెంచారు. ఇట్లా ఒక సంవత్సరం కాదు.. మూడు సంవత్సరాలు 15శాతం పెరుగుతుందని చెబితే.. డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న తాను అప్పటికప్పుడే లేఖ రాశాను’’ అని సీఎం కేసీఆర్‌ గుర్తు చేశారు.

టీడీపీ హయాంలో రైతులపై కాల్పులు..
‘‘ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో ప్రజలు, రైతులు బషీర్‌బాగ్‌లో నిరసన తెలిపేందుకు వస్తే పట్టపగలు కాల్పులు జరిపి ముగ్గురు రైతులను చంపేశారు. కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ప్రదర్శన జరిగింది. చనిపోయిన వారు సైతం కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలు. ఆ తర్వాత కాంగ్రెస్‌ నేతలు మొఖా దొరికిందని అందులోకి చొరబడి.. ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వద్ద దీక్ష చేపట్టారు. అంతకు మించి ఏమీ చేయలేదు. ఆ తర్వాత సమైక్య రాష్ట్రంలో న్యాయం జరుగదని భావించి.. తాను కొంతమంది మిత్రులను కలిసి ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఓడిపోవద్దు.. ఎందుకంటే కాంగ్రెస్‌ పార్టీ నాయకులే తాపకొకరు బయలుదేరాలి.. జై తెలంగాణ అనాలే.. పిలిచి మంత్రి పదవి ఇవ్వగానే తెలంగాణ దుకాణం బంద్‌ చేయాలి. ఇది ఎట్లా తయారయ్యిందంటే.. ఉద్యమం అంటే నమ్మని పరిస్థితి వచ్చింది. వీళ్లు ఎక్కడ చేస్తరు ఉద్యమం అనే పరిస్థితి వచ్చింది. అనేక దఫాలుగా ఉద్యమాలు చేపట్టి విరమించింది కాంగ్రెస్‌ నాయకులే’’నని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement