పశ్చిమబెంగాల్ మాజీ సీఎం, సీపీఎం సీనియర్ లీడర్ బుద్దదేవ్ భట్టాచార్జీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆదివారం ఆయన నాన్ ఇన్వాసివ్ వెంటిలేటరీ సపోర్ట్‌లో ఉన్నారని, ఉడ్స్ల్యాండ్స్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో డాక్టర్ రూపాలీ బసు తెలిపారు. 79 ఏండ్ల ఈ వృద్ధ నాయకుడి ఆరోగ్యం గురించి కొద్ది రోజులుగా ఆందోళనకరమైన వార్తలు వస్తున్నాయి. కాగా, సందర్శకులు, కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారని, డాక్టర్ల ట్రీట్మెంట్కు రెస్పాండ్ అవుతున్నారని వైద్య నిపుణులు తెలిపారు.
బుద్దదేవ్ భట్టాచార్జీ దీర్ఘకాలిక అబ్ర్టక్టివ్ పల్మనరీ డిసీజ్‌తో బాధపడుతున్నారు. అంతేకాకుండా వయస్సు సంబంధిత సమస్యలు కూడా ఉన్నాయి. శ్వాసకోశ సమస్యల కారణంగా ఆయనను జులై 29వ తేదీన ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. కాగా, భట్టాచార్జీ 2000 నుండి 2011 వరకు పశ్చిమ బెంగాల్ సీఎంగా ఉన్నారు. ఆయన రాష్ట్రానికి 7వ ముఖ్యమంత్రి. 2011 ఎన్నికలలో ఓటమితో పశ్చిమ బెంగాల్‌లో 34 ఏళ్ల లెఫ్ట్ ఫ్రంట్ సుదీర్ఘ పదవీకాలం ముగిసింది. ఇక.. ఆయన పదవిలో ఉన్న సమయంలో ప్రస్తుత సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలో పారిశ్రామిక భూసేకరణపై ఆరోపణలు వచ్చాయి. 2022లో తన పార్టీ ప్రధాన సభ్యత్వం కోసం అన్ని పదవులను వదులుకున్నారు. భట్టాచార్జీ సీపీఐ(ఎం)లో సీనియర్ వ్యక్తిగా ప్రముఖ స్థానంలో కొనసాగుతున్నారు.