Sunday, May 5, 2024

Crime | చోరీ కేసుల‌ను ఛేదించిన పోలీసులు.. ల‌క్ష‌ల్లో న‌గ‌దు, బంగారు న‌గ‌ల స్వాధీనం

పెద్ద‌ప‌ల్లి (ప్ర‌భ‌న్యూస్‌): తాళం వేసి ఉన్న ఇండ్లలో చోరీలకు పాల్పడిన ఒకరిని అరెస్టు చేసి సుల్తానాబాద్ సర్కిల్ పోలీసులు ఎనిమిది చోరీ కేసులు చేదించారు. చోరీలకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేయడంతో పాటు 12.11 లక్షల రూపాయల నగదు, 102 గ్రాముల బంగారం, 945 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం పెద్దపల్లి డిసిపి కార్యాలయంలో రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి నిందితుని వివరాలు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ కు చెందిన జెట్ పట్ పవన్ 2022 లో మైనర్ బాలికను ప్రేమ పేరుతో కిడ్నాప్ చేసిన విషయంలో చెన్నూరు, బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు కావడంతో పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారన్నారు.

ఆ సమయంలో పవన్ జైల్లో ఉన్న మిగతా ఖైదిలతో దొంగతనాలు సులువుగా ఎలా చేయడం తెలుసుకున్నాడన్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత పగటి పూట తాళం వేసిన ఇండ్లను పరిశీలించి రాత్రిపూట తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడినాడన్నారు. నిందితుడు పవన్ సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు, పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఇంట్లో చోరీకి పాల్పడినాడన్నారు. ఈనెల 5వ తేదీన సుల్తానాబాద్ మండలం అల్లిపూర్ లో తాళం వేసి ఉన్న రావుల మల్లయ్య ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్న 11 లక్షల రూపాయల నగదు, 25 తులాల వెండి, ఆరున్నర తులాల బంగారం అపహరించుకొని వెళ్లాడన్నారు. బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేస్తున్న క్రమంలో మంగళవారం ఉదయం కాల్వ శ్రీరాంపూర్ లో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న పవన్ ను అదుపులోకి తీసుకొని విచారించగా చోరీల విషయం బయటపడిందన్నారు.

అతని వద్ద నుండి ఎనిమిది ఇళ్లలో చోరీ చేసిన నగదు, బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. కమిషనరేట్ పరిధిలోని ప్రజలు విలువైన ఆభరణాలు, ఎక్కువ మొత్తంలో నగదు ఇళ్లలో ఉంచుకోరాదన్నారు. ఇది ఎక్కువ తాళం వేసి ఊర్లకు వెళ్తున్న సమయంలో సంబంధిత పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించాలన్నారు. చోరీల కేసులను చేదించిన సుల్తానాబాద్ సిఐ జగదీష్, కాల్వ శ్రీరాంపూర్, సుల్తానాబాద్ ఎస్సైలు శ్రీనివాస్, విజయేందర్, అశోక్ రెడ్డి, ఏఎస్ఐ తిరుపతి, రఘు, సిబ్బంది రమేష్ రాజేష్, రమేష్ లను అభినందించి నగదు రివార్డ్ లను అందజేశారు. ఈ సమావేశంలో పెద్దపల్లి డిసిపి వైభవ్, ఏసిపి మహేష్ లతో పాటు పలువురు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement