Thursday, May 9, 2024

Telangana: విద్యార్థులను ఆకట్టుకుంటున్న’గాంధీ’ చిత్రం.. 552 థియేటర్లలో ప్రదర్శన

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: స్వతంత్ర వజ్రోత్సవాల వేడుకల్లో భాగంగా పాఠశాల విద్యార్థులకు గాంధీ సినిమాను ఉచితంగా తెలంగాణ ప్రభుత్వం చూపిస్తోంది. ఈ సినిమా విద్యార్థులకు విశేషంగా ఆకట్టుకుంటుంది. నాటి స్వాతంత్య్ర ఉద్యమ తీరును, ఉద్యమకారుల త్యాగాలను నేటి తరమునకు అవగాహన కల్పించాలని మహాత్మా గాంధీ బయోపిక్‌ను విద్యార్థులకు చూపిస్తున్నారు. పాఠశాల విద్యార్థులకు ఉచితంగా గాంధీ చిత్రాన్ని ప్రతి రోజు మార్నింగ్‌ షోగా ప్రదర్శిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 552 థియేటర్లలో గాంధీ సినిమా ప్రదర్శిస్తున్నారు. ప్రతి రోజు 2.50 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా ఈ చిత్రాన్ని ప్రభుత్వం చూపిస్తోంది. ఇప్పటి వరకు 22.50 లక్షల మంది విద్యార్థులు ఈ చిత్రాన్ని తిలకించారు.

ఈనెల 21 వరకు గాంధీ చిత్ర ప్రదర్శన థియేటర్లలో నిర్వహిస్తారు. ఈనెల 9 నుంచి 11 వరకు, 14 నుంచి 21వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సినిమా ప్రదర్శితమౌతోంది. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1.15 గంటల వరకు ప్రదర్శన చేస్తున్నారు. ఈ చిత్రం హిందీ, ఇంగ్లీష్‌ వర్షన్‌లలో ప్రదర్శించబడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శితమౌతున్న గాంధీ సినిమా భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. అందరిలో సంఘటిత భావాన్ని పెంపొందిస్తోంది. సినిమా విడుదలై 40 ఏళ్లు అయినప్పటికీ నేటి సమాజానికి ఆదర్శనీయంగా నిలుస్తోంది. పక్షం రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా స్వాతంత్య్ర నడక, గాంధీ సినిమా ప్రదర్శన, బుక్‌ఫెయిర్‌ నిర్వహించడం, ఫోటో ఎగ్జిబిషన్‌ వంటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు.

75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నేటితరం పిల్లలను స్వాతంత్య్ర పోరాటంపై చతన్యవంతం చేసేందుకు గానూ గాంధీ బయోపిక్‌ను ప్రదర్శిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో గాంధీ సినిమా ప్రదర్శన ఏర్పాట్లపై చత్తీస్‌ఘడ్‌, రాజస్తాన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు ఆరా తీసినట్లు సమాచార, పౌరసంబంధాల శాఖ, ఎంఏయుడి ప్రత్యేక కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement