Monday, May 20, 2024

TS | రైతులను పొట్టన పెట్టుకున్న బడే బాయ్, చోటే బాయ్ : కేసీఆర్

బడే భాయ్ 15 లక్షలు ఇయ్యలే.. చోటే భాయ్ 15 వేలు ఇయ్యలే.. అటువంటి వారికి మే 13న జరిగే పార్లమెంటు ఎన్నికల పోలింగ్లో ఓటు ఎలా వేస్తారని మాజీ ముఖ్యమంత్రి బైఆర్ఎస్ అధినేత కేసిఆర్ ప్రశ్నించారు. గురువారం రాత్రి కరీంనగర్ జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా నిర్వహించిన కార్నర్ మీటింగ్లో మాట్లాడుతూ…. బిజెపికి కేంద్రంలో అధికారం ఇస్తే విదేశాల నుండి నల్ల డబ్బును తీసుకువచ్చి ప్రతి కుటుంబానికి 15 లక్షలు ఇస్తామని ప్రగల్బాలు పలికిన మోడీ పదేళ్లు గడిచిన హామీ నిలుపుకోలేదన్నారు.

కాంగ్రెస్కు అధికారం ఇస్తే 15 వేల రూపాయల రైతుబంధు ఇస్తామని దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడిచిన రైతులకు ఇచ్చిన హామీని రేవంత్ రెడ్డి తప్పారన్నారు. మహిళలందరికీ 2500 రూపాయలు ఇస్తామని, కళ్యాణ లక్ష్మి తో పాటు తులం బంగారం ఇస్తామని, విద్యార్థినిలకు స్కూటీలు ఇస్తామని, రైతు కూలీలకు 12000 ఇస్తామని, పింఛన్లను 4 వేలకు పెంచుతామని ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు.

డిసెంబర్ 9న 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి 5 నెలలుగా అమలు చేయడం మరిచి ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఆగస్టు 15వ తేదీన 2 లక్షల రుణమాఫీ చేస్తామని మరో డ్రామాకు తెరలేపారన్నారు. ప్రజలను మోసగించిన కాంగ్రెస్ పార్టీని రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బొంద పెట్టాలన్నారు. బిజెపి మత విద్వేషాలను రెచ్చగొట్టి ఓట్లను రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తుందన్నారు. పాకిస్తాన్ ను బూచిగా చూపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూడటం బిజెపికి అలవాటుగా మారిందన్నారు.

ఆటో రిక్షా కార్మికులకు 12000 ఇస్తామని సిఎం మాట తప్పారన్నారు. తొమ్మిదిన్నర ఏళ్లలో ఏ రోజు రెప్పపాటు కరెంటు పోకుండా తాము ప్రభుత్వం నదిపామని, ఈ ప్రభుత్వానికి కరెంటు ఇవ్వడం చేతకావడం లేదన్నారు. సాగునీటికి దిక్కేలేదు కనీసం తాగునీరు కూడా అందించని అసమర్థ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ భాను ప్రసాదరావుతోపాటు పెద్ద సంఖ్యలో ప్రజల పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement