Sunday, April 28, 2024

24గంటల్లో కేసు పరిష్కారం.. సిపి రంగనాథ్ ఫ్లెక్సీకి పాలాభిషేకం

వరంగల్ క్రైమ్ (ప్రభ న్యూస్) .. దివ్యాంగుడి భూ పోరాటానికి వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ జోక్యంతో పోలీసులు న్యాయం చేశారు. రెండేళ్లుగా న్యాయం కోసం అన్ని ప్రభుత్వ కార్యాల‌యాల చుట్టూ చెప్పులు తిరిగేలా దొర‌క‌ని సాయాన్ని, న్యాయాన్ని వరంగల్ పోలీస్ బాస్ రంగ‌నాథ్ స‌త్వ‌ర‌మే అందించారు.ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే విచారణ జరిపి భూ అక్రమణదారుడిపై కేసు నమోదు చేసి,దివ్యాంగుడి కుటుంబానికి న్యాయం చేకూర్చారు. రెండేళ్లుగా న‌డుస్తున్న భూ సమస్యను 24 గంటల్లో కొలిక్కి తెచ్చిన పోలీస్ కమీషనర్ ఏవి రంగనాథ్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేసి, తమ ఆనందాన్ని పంచుకున్నారు. తమ కష్టం తీర్చిన దేవుడిగా భావిస్తూ హన్మకొండ జిల్లా వంగపాడు లోని అంబేడ్కర్ విగ్రహం సెంటర్ లో దివ్యాంగుడి కుటుంబం పాలాభిషేకం చేసి,తమ సంతోషాన్ని చాటుకున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ రెండవ డివిజన్ పరిధిలోని వంగపాడులో కొత్వాల్ ఏవి రంగనాథ్ కు ..బాధితులు గోనెల సమ్మయ్య కుటుంబం పాలాభిషేకం చేశారు.


ఈ సందర్భంగా గోనెల రమేష్ మాట్లాడుతూ.. సామాన్యుడికి న్యాయం చేయ‌క‌పోవ‌డం కూడ అన్యాయ‌మే అవుతుంద‌ని భావిస్తూ తమకు స‌త్వ‌ర న్యాయం అందించిన పోలీస్ కమిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ వర్క్ స్టైల్ కు వారు ఫిదా అయ్యారు.ఇప్పటికే భూ క‌బ్జాదారుల పాలిట సింహ‌స్వ‌ప్నంలా మారి, అన్ని బ‌లాలు కలిగిన వారు చేస్తున్న అన్యాయాల‌ను అణ‌చివేస్తూ.. అణ‌గారిన వర్గాలకు అండగా నిలుస్తూ తగిన న్యాయం చేస్తున్న రియల్ హీరో వరంగల్ పోలీస్ బాస్ అంటూ నినాదాలు చేస్తూ క్షీరాభిషేకం నిర్వహించారు. ఓరుగల్లులో రెచ్చిపోతున్న భూ మాఫియాను క‌ట‌క‌టాల్లోకి నెడుతూ అక్రమార్కుల గుండెల్లో సింహ స్వప్నంగా నిలుస్తున్నార‌ని కొనియాడారు. దివ్యాంగుడినైన తన భూ పోరాటానికి న్యాయం చేశారని సంతోషం వ్యక్తం చేశారు..
హ‌నుమ‌కొండ జిల్లా హ‌స‌న్‌ప‌ర్తి మండ‌లం వంగ‌ప‌హాడ్ గ్రామానికి చెందిన గోనెల స‌మ్మ‌య్య అనే దివ్యాంగుడు అదే గ్రామానికి చెందిన రుద్రార‌పు శ్రీ‌నివాస్ అనే వ్య‌క్తి వ‌ద్ద నుంచి 2002 లో 214 సర్వే నెంబర్ లో ఎక‌రం భూమిని సాదాబైనామా ద్వారా కొనుగోలు చేశాడు. నాటి నుంచి ఆ భూమిని సాగు చేస్తున్నారు. అయితే గ్రేట‌ర్ ప‌రిధిలో సాదాబైనామా అమ‌లు కాక‌పోవ‌డం, ధ‌ర‌ణిలో తిరిగి భూ విక్ర‌య‌దారు అయిన రుద్రార‌పు శ్రీ‌నివాస్ పేరు రావ‌డంతో 20 ఏండ్లుగా భూమిని సాగు చేస్తున్న దివ్యాంగుడైన గోనెల స‌మ్మ‌య్య‌పై.. శ్రీనివాస్ దౌర్జ‌న్యానికి దిగాడు. ప‌లుమార్లు శ్రీనివాస్ బెదిరించ‌డం, అమ్మిన భూమిని తిరిగి లాక్కొని స‌మ్మ‌య్య‌ భూమిని క‌బ్జాచేయ‌డంతో బాధితులు న్యాయం కోసం సీపీ ఏవి రంగనాథ్ ని ఆశ్ర‌యించారు.
బాధితులు గోనెల రమేష్ మాట్లాడుతూ తాము సీపీని క‌లిసిన వెంట‌నే ఖాజీపేట ఏసీపీ శ్రీనివాస్ ను విచార‌ణకి ఆదేశించి,నిజానిజాలు నిగ్గు తేల్చి తగిన న్యాయం చేకూర్చారన్నారు. ఈ క్ర‌మంలో విచార‌ణ చేప‌ట్టిన ఖాజీపేట ఏసీపీ శ్రీ‌నివాస్ హ‌స‌న్‌ప‌ర్తి ఎస్ ఐ విజ‌య్ కుమార్ లు క్షేత్ర‌స్థాయిలో విచార‌ణ చేప‌ట్టి తగిన సాక్ష్యాధారాలను పరిశీలించి న్యాయం చేకూర్చినందుకు వారికి రమేష్,వజ్రమ్మ,కుటుంబం కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement