Monday, May 6, 2024

Telangana – విఆర్ఎల‌కు చెరువుల బాధ్య‌త‌లు….

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ జీవనరీతికి కేంద్ర బిందువుగా నిలిచిన చెరువుల పునరుద్ధరణతో పాటుగా పర్యవేక్షణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. సముద్ర మట్టానికి 664.5 మీటర్ల ఎత్తులో విస్తరించిన దక్కన్‌ పీఠభూమిలో సముద్రాల పేరుతో శాతవాహనులు, విష్ణుకుండినులు, కాకతీయులతో పాటుగా అనేక రాజ వంశాలు చెరువులను నిర్మించి తెలంగాణను సస్యశ్యామలం చేశారు. ప్రాచీన అంచనాల మేరకు తెలంగాణలో సుమారు లక్షలకు పైగా చెరువులు విస్తరించి వ్యవసాయం పండుగా జరిగినట్లు ఆధారాలు లభ్యమవుతు న్నాయి. 1970 నాటికి రాష్ట్ర ఆదాయంలో తెలంగాణ ఆదాయం సింహభాగంలో ఉండేది. అయితే తెలంగాణ వచ్చేనాటికి మిగిలిన 46 వేల 531 చెరువుల పునరుద్ధరణకు మిషన్‌ కాకతీయ ఏర్పాటు చేసి పునరుద్ధరించడంతో ప్రస్తుతం సుమారు 25 లక్షల ఎకరాలు చెరువులపై ఆధారపడి పంట దిగుబడి ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మిషన్‌ కాకతీయతో పునరుద్ధరించిన చెరువులను పర్యవేక్షించి పంటకాలువలకు నీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాత్మకమైన కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. చెరువుల పర్యవేక్షణ బాధ్యతలను వీఆర్‌ఏలకు అప్పగించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.

ఈ మేరకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గ్రామ సహాయకులను లష్కర్‌ బాధ్యతలను అప్పగించేందుకు రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అధ్యక్షతన మంత్రులు జగదీష్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌తో మంత్రివర్గ ఉపసంఘం నియమించి విధివిధానాలను రూపొందిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నీరడి బాధ్యతలు నిర్వహిస్తున్న గ్రామ సేవకులకు లష్కర్‌ పోస్టుల్లో నియమించి చెరువుల పర్యవేక్షణ, పంటకాలువల నిర్వహణ బాధ్యతలను అప్పగించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. రాష్ట్రంలోని 5,679 మంది గ్రామసేవకులకు ఒక్కొక్కరికి 10 చెరువులను అప్పగించేందుకు విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ఆధీనంలో 5,411, పంచాయితీరాజ్‌ ఆధీనంలో 32,068, ఊటచెరువులు 4,962, అటవీ శాఖ ఆధీనంలో 1229తో పాటు పట్టణ ప్రాంతాల చెరువులతో కలిసి 46 వేల 531 చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల కింద 25లక్షల ఎకరాలు సాగు అవుతున్నాయి. అయితే ఈ చెరువులను పటిష్టంగా పర్యవేక్షించి సాగుభూములకు నీరు అందించే బాధ్యతలను ప్రభుత్వం వీఆర్‌ఏలకు లష్కర్‌ పోస్టులు సృష్టించి బాధ్యతలు అప్పగించనుంది.

ఈ నేపథ్యంలో 50వేల ఎకరాల ఆయకట్టు దాటిన ప్రతి 10 చెరువులకు ఒక లష్కర్‌ను నియమించాలని నీటిపారుదల శాఖప్రాథమికంగా నిర్ణయించింది. చిన్న చెరువులు, కుంటలు, ఊట చెరువులు, పట్టణప్రాంతాల్లోని చెరువు మినహాయిస్తే 30వేల చెరువులు పద్దవిగా ఉన్నట్లు ప్రభుత్వం అంచనావేసింది. రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులు అందుబాటులోకి రావడంతో పాటు చెరువుల పునరుద్ధరణ జరగడంతో క్షేత్రస్థాయి పర్యవేక్షకుల అవసరం అనివార్యమైంది. అయితే నీటి పారుదల పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా తాజాగా వీఆర్‌ఏ సర్వీసులను క్రమబద్ధీకరించే పనుల్లో భాగంగా నీటి పారుదల శాఖ 5వేల 679 మందికి లష్కర్‌ బాధ్యతలు అప్పగించేందుకు విధివిధానాలను రూపొందిస్తున్నారు. ఇంజనీర్లకు సహాయకులకు లష్కర్‌తో పాటు 1004 మంది సహాయకులను కూడా తీసుకునే అవకాశాలున్నట్లు సమాచారం.

ప్రస్తుతం నల్గొండ జిల్లాలో 554, సంగారెడ్డి జిల్లాలో 379, ఖమ్మంలో 369, సిద్ధిపేటలో 366, సూర్యాపేటలో 343, నిజమాబాద్‌ జిల్లాలో 314, గద్వాల 248 మంది వీఆర్‌ఏలకు బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. వరంగల్‌, హైదరాబాద్‌ జిల్లాల్లో సాగునీటి పారుదల ఇంజనీర్ల ఆధీనంలోనే చెరువుల పర్యవేక్షణ జరగనుంది. అయితే 5,679 మంది వీఆర్‌ఏల్లో ప్రస్తుతం మొదటి విడతగా 2,575 మంది వీఆర్‌ఏలకు బాధ్యతలు అప్పగించగా మిగిలిన 3,104 మంది వీఆర్‌ఏలను మిగతా జిల్లాలకు బాధ్యతలు అప్పగించేందుకు నీటి పారుదల శాఖ ప్రణాళికలను సిద్ధంచేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement