Wednesday, May 8, 2024

Andhra Pradesh – కాపు ఉప కులాల సంక్షేమానికి ప్ర‌త్యేక కార్పొరేష‌న్లు

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో కాపు ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలో విధి విధానాలను ఖరారు చేయనున్నట్లు సమాచారం. కాపుల సంక్షేమానికి ఏర్పాటయిన కాపు వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ పరిధిలో ప్రస్తుతం ఉప కులాలైన తెలగ, బలిజ, ఒంటరి కులస్తులను చేర్చారు. అయితే వీరితో పాటు తూర్పుకాపు, శెట్టిబలిజ లకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటుతో పాటు జనాభా దామాషా ప్రకారం సంక్షేమ పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వీలైనంత త్వరలో కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేయాల ని సీఎం వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి ఆదేశించినట్లు చెబుతున్నారు. బుధవారం రాష్ట్ర మంత్రి మండలి సమావేశం అనంతరం కూడా ఈ అంశం ప్రస్తావన కు వచ్చినట్లు తెలియవచ్చింది. కాపు కార్పొరేషన్‌ పరిధిలో 45 నుంచి 60 ఏళ్ల లోపు మహిళలకు ప్రభుత్వం వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం కింద ఆర్థిక చేయూతనందిస్తోంది. ఏడాదికి రూ. 15 వేలు చొప్పున ఐదేళ్లలో రూ. 75 వేలు నగదు బదిలీ పథకం కింద లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తోంది.

రాష్ట్ర జనాభాలో 26 శాతంగా ఉన్న కాపుల సంక్షేమంతో పాటు ఇందులో 3 శాతంగా ఉన్న బలిజలు, ఒక్కో శాతంగా ఉన్న ఒంటరి, తెలగ కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయటం ద్వారా వారి ఆర్థిక పరిపుష్టికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని సీఎం జగన్‌ అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు తెలియవచ్చింది. గత నాలుగేళ్లలో కాపుల సంక్షేమానికి రూ. 32 వేల కోట్లు కేటాయించినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఉత్తరాంధ్రలో తూర్పుకాపులు, శెట్టి బలిజలతో పాటు రాయలసీమలో బలిజలు వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్నారు. ప్రత్యేక కార్పొరేషన్‌తో వీరికి వెసులుబాటు కల్పించాలనేది ప్రభుత్వ భావన. దీనివల్ల ఆర్థిక స్వావలంబనతో పాటు రాజకీయంగా ప్రాతినిథ్యం కల్పించినట్లవుతుందని సీఎం జగన్‌ వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పటికే దేశంలో ఎక్కడాలేని విధంగా బీసీ ఉపకులాలకు 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన సంగతి విదితమే. గత సార్వత్రిక ఎన్నికల్లో పాదయాత్ర సందర్భంగా ఆయా వర్గాల నుంచి వచ్చిన విజ్ఞాపనలను తిరగేస్తున్నారు. ఇందులో భాగంగానే కాపు ఉప కులాల కార్పొరేషన్లు ఏర్పాటు కానున్నాయి. ప్రభుత్వమే కొంత కార్పస్‌ఫండ్‌ కేటాయించి ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసే అంశం పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. కొత్త కార్పొరేషన్లతో రాజకీయంగా ప్రతిపక్ష పార్టీలకు కూడా చెక్‌ పెట్ట వచ్చనే భావనతో ఉన్నట్లు వినికిడి.

బీసీ వెల్ఫేర్‌ విభాగం పరిధిలోనే కార్పొరేషన్లు ఏర్పాటు కానున్నాయి. ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అగ్రకులాలకు సైతం కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా జయహో బీసీ, జయహో ఎస్సీ తరహాలోనే త్వరలో జయహో ఆదివాసీ కార్యక్రమాన్ని ఉత్తరాంధ్ర వేదికగా నిర్వహించేందుకు అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కసరత్తు జరుపుతోంది. తొలుత ఈ కార్యక్రమాన్ని పోలవరం ప్రాజెక్టు సమీపంలో నిర్వహించాలని నిర్ణయించినా ఏజెన్సీ ప్రజల రాకపోకలకు ఇబ్బంది కారణంగా విశాఖ లేదా పాడేరులో నిర్వహిస్తే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల విజ్ఞప్తి మేరకు పాడేరు, అరకు ప్రాంతాలను ప్రత్యేక జిల్లాలుగా వర్గీకరించి అటవీప్రాంత అభివృద్ధిపై దృష్టి సారించింది. రంపచోడవరంతో కలుపుకుని ఆదివాసీలు నివసించే ప్రాంతాల్లో వారి ఆర్థిక, భౌగోళిక, రాజకీయ, నైసర్గిక పరిస్థితులను ఆధ్యయనం చేసి భవిష్యత్‌ అవసరాలను తీర్చే దిశగా జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement