Friday, May 3, 2024

ఉప ఎన్నిక ఎఫెక్ట్: హుజూరాబాద్ కు రూ.35 కోట్ల నిధులు

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఇందు కోసం అన్నీ పార్టీలు సిద్ధమవుతున్నాయి. బీజేపీ అభ్యర్థిగా ఈటల బరిలో దిగనుండగా.. సిట్టింగ్ స్థానాన్ని మళ్లీ కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు హుజురాబాద్ లో మకాం వేశారు. ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం హుజురాబాద్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. హుజూరాబాద్ పట్టణాభివృద్ధికి రూ.35 కోట్లను కేటాయిస్తూ జీవో విడుదల చేసింది. ఇందులో వార్డుల అభివృద్ధి కోసం రూ. 25 కోట్లు, తాగునీటి కోసం రూ. 10.52 కోట్లను కేటాయించింది. ఈ విషయాన్ని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ పనులన్నింటినీ 45 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ఈ పనులను చేయడానికి ప్రత్యేక అధికారులను నియమిస్తామని మంత్రి తెలిపారు.

ఉప ఎన్నిక‌లు రానున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం భారీగా నిధులు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. హుజురాబాద్ అభివృద్దిని తామే చేశామ‌ని చెప్పుకునే విధంగా ప్రణాళిక రచిస్తోంది. మరోవైపు తనను ఓడించేందుకు టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగం చేస్తుందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అంటున్నారు. డబ్బులతో తనను ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. హుజురాబాద్ ప్రజలు ప్రలోభాలకు లొంగరని, తననే గెలిపిస్తారని చెప్పారు.

ఇదీ చదవండి: హుజురాబాద్ బీజేపీలో ములసం? టీఆర్ఎస్ లోకి పెద్దిరెడ్డి?

Advertisement

తాజా వార్తలు

Advertisement