Thursday, April 25, 2024

గంగానదిలో పెట్టె.. పెట్టెలో చిన్నారి

కురువంశం రాజ్య‌మేలిన రోజుల్లో గంగ‌మ్మ ఓడిలో క‌ర్ణుడు దొరికిన విష‌యం మ‌న‌కు తెలిసిందే. అచ్చం అలాంటి సీన్ ఒక‌టి ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఘాజీపూర్‌లో జ‌రిగింది. అప్పుడు గంగమ్మ ఒడిలో క‌ర్ణుడు దొర‌క‌గా.. ఇప్పుడు గంగ‌మ్మే ల‌భించింది. గంగాన‌దిలో ప‌డ‌వ న‌డుపుకుంటూ జీవ‌నం సాగించే ఓ సామాన్యుడి చెంత‌కు చేరిందా గంగ‌మ్మ‌. పెట్టెలో శిశువును చునారీలో చుట్టిపెట్టి జాత‌క‌చ‌క్రం కూడా ఉంచారు. ఈ విష‌యం తెలుసుకున్న పోలీసులు శిశువును ప్ర‌భుత ఆశాజ్యోతి కేంద్రానికి త‌ర‌లించి ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.

యూపీలోని ఘాజిపూర్ శివారులో ప్ర‌వ‌హించే గంగానది దాద్రి ఘాట్‌లో చెక్క పెట్టె కనిపించింది. నీటిపై తేలియాడుతూ ఉన్న ఆ పెట్టెలో నుంచి ఏడుపులు వినిపించాయి. అక్క‌డే ప‌డ‌వ‌ న‌డుపుకుంటూ జీవ‌నం సాగించే గుల్లు చౌద‌రి అనే వ్య‌క్తి ఆ బాక్స్‌ను చూసి తీసుకున్నాడు. ఆ పెట్టెను తెరిచి చూడ‌గా.. అందులో ఒక నవజాత శిశువు కనిపించింది. పెట్టెలో దుర్గామాత ఫొటోతో పాటు చాలా మంది దేవతల ఫొటోలు ఉన్నాయి. అందులో చిన్నారి జాత‌క‌చ‌క్రం కూడా ఉన్న‌ది. ఈ విష‌యం పోలీసుల వ‌ర‌కు వెళ్ల‌డంతో పోలీసులు ఆ బాలిక‌ను ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో న‌డిచే ఆశాజ్యోతి కేంద్రానికి తీసుకెళ్లారు. శిశువు ఆరోగ్యంగా ఉన్న‌ద‌ని పోలీసులు తెలిపారు. ఎవ‌రు అలా నీటిలో వ‌దిలార‌నేదానిపై విచార‌ణ జ‌రుపుతున్న‌ట్లు పోలీసులు చెప్పారు.

పెట్టెలో ల‌భించిన జాతకచ‌క్రం ప్ర‌కారం పాప‌ పుట్టిన తేదీ మే 25. అమ్మాయి పేరు జనన చార్టులో గంగ అని వ్రాసి ఉన్న‌ది. అంటే మూడు వారాల క్రిత‌మే జ‌న్మించింది అన్న‌మాట‌. గంగానదిలో నవజాత శిశువు ల‌భించడం చర్చనీయాంశంగా మారింది. చిన్నారి కుటుంబ సభ్యులను వెతికే ప‌నిలో పోలీసులు నిమ‌గ్న‌మ‌య్యారు. కొన్ని మూడ‌నమ్మకాలు లేదా తాంత్రిక కర్మలను నెరవేర్చడానికి ఇలా చేసి ఉంటార‌నే చ‌ర్చ కూడా జ‌రుగుతుండ‌టం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement