Thursday, May 2, 2024

T Congress – 17 లోక్ స‌భ సీట్లు గెలిచే ల‌క్ష్యంగా ప‌ని చేస్తాం….ఖ‌ర్గే, రాహుల్ తో టి కాంగ్రెస్ నేత‌లు….

కొత్త ఢిల్లీ – అసెంబ్లీ ఎన్నిక‌ల విజ‌యానికి కొన‌సాగింపుగా లోక్ స‌భ ఎన్నిక‌ల‌లోనూ క‌ల‌సిక‌ట్టుగా ప‌ని చేస్తామ‌ని, మొత్తం 17 లోక్ స‌భ స్థానాల‌ను గెలిచేందుకు శ్ర‌మిస్తామ‌ని టి కాంగ్రెస్ నేత‌లు ఆ పార్టీ అధిష్టానానికి హామీ ఇచ్చారు.. లోక్ స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఢిల్లీలోని ఎఐసిసి కార్యాల‌యంలో నేడు తెలంగాణ లోక్ సభ ఇంచార్జిలతో అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ భేటీ స‌మావేశం నిర్వ‌హించారు… ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్య‌మంత్రి రేవంత్ ఈ స‌మావేశంలో పాల్గొన‌వ‌ల‌సి ఉన్నా ఇత‌ర కార‌ణాల‌తో ఆయ‌న హైద‌రాబాద్ లోనే ఉండిపోయారు..

ఈ స‌మావేశం అనంత‌రం మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల అంశంపై చర్చించామ‌ని తెలిపారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు పార్లమెంటు కో-ఆర్డినేటర్ల మీటింగ్ జరిగిందని చెప్పారు. పార్లమెంటు సార్వత్రిక ఎన్నికలలో ఏ విధంగా ముందుకు వెళ్లాలని చెప్పారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా కలసికట్టుగా పని చేశారో.. పార్లమెంట్ లో కూడా అదే విధంగా ముందుకు వెళ్లాలని సూచించారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాలను కలుపుకొని ముందుకెళ్లాలని చెప్పారని తెలిపారు. మెజార్టీ సీట్లలో గెలవాలని దిశా నిర్దేశం చేశారన్నారు. దక్షిణ తెలంగాణలో మెజార్టీ సీట్లు గెలుచుకో రావాల్సిన బాధ్యత కోఆర్డినేటర్ అని ఖర్గే చెప్పారని సురేఖ పేర్కొన్నారు.

అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే పార్లమెంటు ఎన్నికల విధివిధానాలపై చర్చ జరిగిందని తెలిపారు. పార్టీ అధ్యక్షుడు ఖర్గే కొన్ని నియమ నిబంధనలు చెప్పారన్నారు. పార్టీలో ఉన్న వివిధ స్థాయి నేతలు చేయాల్సిన కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారని పేర్కొన్నారు. కాగా.. నల్గొండ సీటు 3లక్షల ఓట్లతో గెలుస్తుంద‌ని అంటూ అలాగే మ‌రో 14 పార్లమెంట్ స్థానాలు పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పారన్నారు. అందరూ సమన్వయం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేయాలంటూ సూచించారని ఉత్తమ్ కుమార్ తెలిపారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ చేసామని తెలిపారు. ప్రచారం ఎలా ఉండాలి.. పోల్ మేనేజ్మెంట్, ప్రజలతో మమేకం అవ్వడంపై ఖర్గే మార్గానిర్ధేశం చేశారన్నారు. దేశ ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించాలని భావిస్తున్నారని చెప్పారు. తెలంగాణలో 17 కి 17 స్థానాలు గెలవడమే లక్ష్యంగా పనిచేస్తామని పొన్నం పేర్కొన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే రాష్ట్రానికి మరిన్ని నిధులు వస్తాయని అన్నారు. రెండు మూడు స్థానాలకోసం బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య పోటీ ఉంటుందని చెప్పారు. గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసిందని ఆరోపించారు. 17కి 17 స్థానాల్లో గెలిపిస్తే ఆరు గ్యారెంటీలతోపాటు మరిన్ని సంక్షేమ పథకాలు అందించేందుకు అవకాశం ఉంటుందని పొన్నం చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement