Saturday, April 27, 2024

Special Story – కేసీఆర్ ప్ర‌చార శంఖ‌రావం – ఉగాది త‌ర్వాత‌ ముహూర్తం!

లోక్‌స‌భ‌ ఎన్నికల్లో పోటీచేసేందుకు బీఆర్ఎస్ ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది. రాష్ట్రంలో అధికారం చేజారడంతో కేడర్‌లో స్థైర్యం దెబ్బతిన్న వేళ.. నేతలంతా ఒక్కొక్కరుగా కారు దిగుతున్నారు. దీంతో గులాబీ బాస్.. తెలంగాణ ఉద్య‌మ నేత‌ కేసీఆర్ అప్రమత్తం అయ్యారు. బీఆర్ఎస్‌కు మూడో స్థానమేన‌ని సర్వే ఫలితాలు చెబుతుండడంతో అధినేత స్వయంగా రంగంలోకి దిగుతున్న‌ట్టు తెలుస్తోంది. శ్రేణులలో ధైర్యం నింపేందుకు, లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచి తమ సత్తా చాటేందుకు కేసీఆర్ ప్లాన్‌ సిద్ధం చేస్తున్నారు.

రోడ్‌షోలు, కార్న‌ర్ మీటింగ్‌లు..

కాంగ్రెస్‌, బీజేపీల కంటే బీఆర్ఎస్ అత్య‌ధిక స్థానాలు సాధించాల‌నే టార్గెట్ పెట్టుకున్న‌ట్టు తెలుస్తోంది. దాదాపు బీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక పూర్తైన నేపథ్యంలో ఉగాది పండుగ తర్వాత కేసీఆర్ ప్రచారం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. భారీ బహిరంగ సమావేశాలకే ఇంపార్టెన్స్ ఇచ్చి.. వాటితో పాటు రోడ్ షోలు, కార్నర్ మీటింగులలో కూడా ఎక్కువగా పాల్గొనాలని కేసీఆర్ డిసైడ్ అయిన‌ట్టు స‌మాచారం అందుతోంది.

సికింద్రాబాద్ బ‌రిలో ప‌జ్జ‌న్న‌..

రాష్ట్రంలోని 17 నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రచారం ఉండేలా పార్టీ శ్రేణులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు గానూ… 13 స్థానాలకు ఇంతకుముందే అభ్యర్థులను డిసైడ్ చేసిన‌ కేసీఆర్.. మరో మూడు స్థానాలకు కూడా క్యాండిడేట్స్‌ని ప్రకటించారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్ నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.పద్మారావు గౌడ్. నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరి నుంచి క్యామ మల్లేష్ బ‌రిలో దిగుతున్నారు. ఇక‌.. హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థిని సోమ‌వారం ప్ర‌క‌టించి సామాజిక స‌మ‌తూకం పాటించిన‌ట్టు తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన గడ్డం శ్రీనివాస్ యాదవ్‌ని హైద‌రాబాద్ లోక్‌స‌భ స్థానంలో కేసీఆర్ పోటీకి దింపారు.

- Advertisement -

అభ్య‌ర్థుల ఎంపిక‌లో సామాజిక స‌మ‌తూకం..

లోక్‌స‌భ‌ ఎన్నికల్లో పోటీచేసే మొత్తం 17 స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్ అభ్యర్థి ప్రకటనతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యింది. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమతూకం పాటించడంతో బహుజన ప్రజా విశ్వాసాన్ని చూరగొన్నది. ప్రజాబలం ఉన్న నేతలను ఎంపికచేయడం ద్వారా ప్రత్యర్థి పార్టీలకన్నా విజయావకాశాలు మెరుగ్గా సాధించే పరిస్థితి కల్పించారు. లిస్టు ప్రకటనతోనే ఒక విశ్వాసం నెలకొనడం గమనార్హం.
ఇటీవలి అసెంబ్లీ ఫలితాల అనంతర పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ పాలనను ప్రజలు తిరిగి గుర్తుకుచేసుకుంటున్న పరిస్థితి ఉన్నది. ఇది సర్వత్రా వ్యాపిస్తున్నది.

ప్ర‌జ‌లకు చేరువ‌య్యేందుకు కేసీఆర్ ప్లాన్‌..

ఈ నేపథ్యంలో ముందుకు వచ్చిన లోక్‌స‌భ ఎన్నికల్లో విజయదుందుభి మోగించేందుకు పార్టీ సన్నద్ధమైంది. అధినేత కేసీఆర్ దీవెనలతో ఎన్నికల కార్యక్షేత్రంలోకి ఎక్కడికక్కడ అభ్యర్థులు దూసుకుపోనున్నారు. కాగా, ఇప్పటికే ప్రకటించిన కొందరు అభ్యర్థులు వారి వారి లోక్‌స‌భ‌ నియోజక వర్గాల్లో పర్యటిస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. ఈ సందర్భంగా వారికి ప్రజల్లోంచి అనూహ్యమద్దతు లభిస్తుండడం గమనార్హం. కాగా ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేసేందుకు అధినేత కేసీఆర్ త్వరలోనే రంగంలోకి దిగనున్నట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్త పర్యటనలతో అటు పార్టీ శ్రేణుల్లో ఇటు ప్రజల్లో పునరుత్తేజాన్ని నింపి బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి ప్రజా మద్దతు కూడగట్టనున్నారు.

మొత్తం బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ఇదే..

1)ఖమ్మం – నామా నాగేశ్వర్ రావు(ఓసీ)
2) మహబూబాబాద్ (ఎస్టీ )మాలోత్ కవిత
3) కరీంనగర్ – బోయినిపల్లి వినోద్ కుమార్ (ఓసీ)
4 )పెద్దపల్లి(ఎస్ .సి ) -కొప్పుల ఈశ్వర్
5 )మహబూబ్ నగర్ -మన్నె శ్రీనివాస్ రెడ్డి (ఓసీ)
6)చేవెళ్ల -కాసాని జ్ఞానేశ్వర్ (బీసీ)
7)వరంగల్ (ఎస్ .సి )-డాక్టర్ కడియం కావ్య
8 )నిజామాబాద్ -బాజి రెడ్డి గోవర్ధన్ (బీసీ)
9 )జహీరాబాద్ -గాలి అనిల్ కుమార్ (బీసీ)
10 ) ఆదిలాబాద్(ఎస్టీ ) -ఆత్రం సక్కు ( ఆదివాసీ)
11 )మల్కాజ్ గిరి -రాగిడి లక్ష్మా రెడ్డి (ఓసీ)
12)మెదక్ -పి .వెంకట్రామి రెడ్డి (ఓసీ)
13 )నాగర్ కర్నూల్ (ఎస్సీ )-ఆర్ .ఎస్ .ప్రవీణ్ కుమార్ .
14) సికింద్రాబాద్ – తీగుళ్ల పద్మారావు గౌడ్ ( బీసీ)
15) భువనగిరి – క్యామ మల్లేశ్ (బీసీ)
16) నల్గొండ – కంచర్ల కృష్ణారెడ్డి (ఓసీ)
17) హైదరాబాద్ – గడ్డం శ్రీనివాస్ యాదవ్ ( బీసీ)

Advertisement

తాజా వార్తలు

Advertisement