Friday, April 26, 2024

Politics – ఓం.. భీమ్‌.. బుష్‌! ఎపి బిజెపిలో అంతా అమితోత్సాహం

అమ‌రావ‌తి – కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టి.. మ‌రో చరిత్ర సృష్టించాలని మోదీషా ద్వయం య‌త్నిస్తోంది. న‌వీన రాజకీయ పాచికలతో ప్రత్యర్థి శిబిరాలను నిర్వీర్యం చేస్తోంది. అలవికాని చోట అధికులమ‌న‌రాదు అనే సూక్తిలో అర్థాన్నే మార్చే ప్రణాళికతో ఎన్నిక‌ల‌కు సర్వసన్నద్ధమవుతోంది. ఇక‌.. ఏపీలో అంతంత మాత్రమే ఉన్న త‌మ ఉనికిని తారా స్థాయికి తీసుకువెళ్లే వ్యూహాన్ని బీజేపీ అమలు చేస్తోంది. ఈ త‌రుణంలో కమలదండులోని పాత కొత్తల‌ జగడం కాస్తా ఏపీ బీజేపీకి చుక్కలు చూపిస్తోంది. టీడీపీ, జనసేన పొత్తుతో ఆరు లోక్‌స‌భ‌ స్థానాల్లో పాగాకు రెడీ కాగా.. ఇప్పటికే నాలుగు స్థానాల్లో విజయం ఖాయమని కమల దండు చిందులేస్తోంది. అయితే.. మరో మూడు స్థానాల్లో అభ్యర్థులపై అసంతృప్తి ఉంద‌ని ఆ పార్టీ నేత‌లే స్ప‌ష్టం చేస్తున్నారు. మరీముఖ్యంగా రెండు చోట్ల గెలిచే అభ్యర్థులను పక్కన పెట్టి.. అసలు గెలుపునకే అవకాశం లేని సీట్లను సర్దుకున్నారనే చర్చ కూడా పీక్ లెవ‌ల్‌కి చేరింది. ఎన్నికల ముందే ఏపీ క‌మ‌ల‌ద‌ళంలో నెల‌కొన్ని పరిస్థితిని ప‌రిశీలిస్తే.. ఓం.. భీమ్‌.. బుష్‌.. అంతా అమితోత్సాహంలాగా క‌నిపిస్తోంది.

(ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి ) ఏపీలో ఆరు ఎంపీ స్థానాల్లో పోటీకి తమ కమలదళాన్ని బీజేపీ సిద్ధం చేయగా… సామాజిక, ఆర్థికాంశాల్లో బీజేపీ వ్యూహంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. 2014 ఎన్నికల్లో టీడీపీతో ప్రత్యక్షంగా.. జనసేనతో పరోక్షంగా పొత్తు పెట్టుకున్న బీజేపీ నాలుగు ఎంపీ స్థానాల్లో పోటీ చేసి.. రెండింటిని కైవశం చేసుకుంది. 2024 ఎన్నికల్లో ఇవే రెండు పార్టీల పొత్తుతో ఆరు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. అరకు (ఎస్టీ), తిరుపతి (ఎస్సీ), అనకాపల్లి (వెలమ), రాజమండ్రి (కమ్మ), నరసాపురం (క్షత్రియ), రాజంపేట (రెడ్డి) సామాజిక వర్గాలకు కేటాయించింది. తెలంగాణ ఎన్నికల్లో బీసీ కార్డును మోత మోగించిన బీజేపీ పెద్దలు.. ప్రతి ఎన్నికల సభలోనూ బీసీల పక్షమని గట్టిగా వక్కాణిస్తున్నారు. కానీ ఏపీ లోక్ సభ అభ్యర్థుల్లో కనీసం ఒక్క బీసీ అభ్యర్థిని కూడా తెరమీదకు తీసుకు రాకపోవటం విశేషం. ఈ విషయం సరే..

కాషాయ పసుపు సేన స్థితి ఏమిటి?
ఏపీలో 2019 లోక్ సభ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీల సొంత బలాన్ని పరిశీలిస్తే అరకులో వైసీపీకి టీడీపీ, జనసేన గట్టిపోటీ ఇస్తే.. రాజమండ్రి, నరసాపురం సెగ్మెంట్లలో జనసేన బలంతోనే టీడీపీ ఓడిపోయింది. ఇక అనకాపల్లి లోక్ సభ స్థానంలో జనసేన ఓట్లు చీల్చటం వల్లనే టీడీపీ అభ్యర్థి ఓడిపోక తప్పలేదు. ఇక తిరుపతి, రాజంపేట నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయలేదు. ఈ మొత్తం ఆరు సీట్లల్లో నాలుగు సీట్లల్లో జనసేన ప్రభావం ఎక్కువగానే ఉంది. ఈ స్థితిలో అరకు, రాజమండ్రి, నరసాపురం, అనకాపల్లి స్థానాల్లో వైసీపీకి గట్టి దెబ్బ తప్పదని రాజకీయ విశ్లేషకుల అంచనా. కాగా వైసీపీ కంచుకోటలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా తన సొంత బలంతో వైసీపీని కంగుతినిపిస్తారని, రాజకీయ ప్రస్థానంలో పునర్జీవనం కోసం కిరణ్ కుమార్ రెడ్డి వర్గం తీవ్రంగా పని చేస్తుందని ఓ అంచనా.

గెలుపు గుర్రాలకు కళ్లాలెన్నో..
బీజేపీ గెలుపు గుర్రాలుగా అంచనా వేస్తున్న అభ్యర్థులకు అడ్డంకులూ కనిపిస్తున్నాయి. ఒకటి పొత్తు జాడ్యం. రెండు అభ్యర్థుల బలహీనతలు. మూడు సామాజిక వర్గం ముభావం. రాజమండ్రి నుంచి పురందేశ్వరీ విజయం దాదాపు ఖాయంగానే అంచనా వేస్తున్నారు. ఇక్కడ కమ్మ సామాజిక వర్గం బలంగా ఉంది. అదే విధంగా జనసేన చేతిలోని సామాజిక వర్గమూ పవన్ కళ్యాణ్ కోసం కదం తొక్కుతోంది. ఐతే, గత రెండు ఎన్నికల్లో మాగంటి మురళీ మోహన్ కుటుంబానికి ఎదురు దెబ్బ తప్పలేదు. 2009లో ఉండవల్లి అరుణ్కుమార్ మీద స్వల్ప మెజారిటీతో మురళీ మోహన్ ఓడిపోయారు. ఈ స్థితిలో పురందేశ్వరీ విజయానికి తెలుగుదేశం, జనసేన కృషి తప్పని సరి. బీజేపీపై ఏమాత్రం వ్యతిరేకతతో క్రాస్ ఓటింగ్ జరిగినా పురందేశ్వరీకి నిరాశ తప్పదు. అనకాపల్లిలో సీఎం రమేష్నాన్ లోకల్ హీరో కావటం తొలి అవరోధంగా కనిపిస్తోంది. అరకులో మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు స్థానిక బలం పర్వాలేదు. దీనికి తోడు ప్రస్తుత ఎంపీ గొడ్డేటి మాధవికి వైసీపీ టిక్కెట్టు ఇవ్వలేదు. అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వైసీపీకి కొత్తపల్లి గీత చుక్కలు చూపించటం ఖాయమని బీజేపీ వర్గాల అంచనా. ఇక తిరుపతి, రాజంపేటల్లో వైసీపీకి గట్టిపోటీ తప్పదు. ఈ రెండు స్థానాల్లో గెలిచే గుర్రాల అంచనాలోనే రాజకీయ పండితులు జుట్టు పీక్కుంటున్నారు.

నరసాపురంలో నీరసం

నరసాపురం లోక్ సభ అభ్యర్థి అంగబలం, ఆర్థిక బలంపైనే ఆందోళన నెలకొంది. భూపతిరాజు శ్రీనివాస వర్మ నిజానికి బీజేపీ సొంత బిడ్డ. ఆర్ ఎస్ ఎస్ పునాదిలో వీహెచ్ పీ శిక్షణలో ఆరితేరిన కమలనాథుడే. కానీ నరసాపురం పరిస్థితి ఇందుకు బిన్నం . ఇక్కడ ఆర్థిక స్థితిమంతుడే పోటీకి అర్హుడని రాజకీయ విశ్లేషకుల అంచనా. 1999లో తెలుగుదేశం పొత్తుతో సినీ హీరో ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఇక 2014లోనూ టీడీపీ పొత్తుతో గోకరాజు గంగరాజు గెలిచారు. నిజానికి 2024లో గోకరాజు గంగరాజు , కృష్ణం రాజు సతీమణి బీజేపీ అభ్యర్థిగా పోటీలో దిగే అవకాశం ఉందని అందరూ ఊహించారు. కానీ వైసీపీపై తిరుగుబాటు ప్రకటించిన రఘురామ కృష్ణం రాజుకే నరసాపురం సీటు ఖాయమని అంచనాలు తెరమీదకు వచ్చాయి.

- Advertisement -

ర‌ఘురామ‌కు మొండిచెయ్యి..

రఘురామకృష్ణం రాజుకు బీజేపీ మొండి చెయ్యి చూపింది. ఇందుకు ప్రధాన కారణం… ఆయన ఏ పార్టీలోనూ నికరంగా నిలబడరని, వైసీపీనే లెక్క చేయలేదని, కనీసం ఆ పార్టీకి రాజీనామా చేయకుండా కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించటంతో బీజేపీ వెనకడుగు వేసింది. 2009 ఎన్నికల్లో కేవలం 11 వేల ఓట్లు సాధించిన భూపతిరాజు శ్రీనివాస వర్మనే తమ అభ్యర్థిగా ప్రకటించారు. పార్టీకి విశ్వాసపాత్రుడు కావటంతోనే ఈ అవకాశం ఆయనకు దక్కింది. ఇక బీజేపీ అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత టీడీపీ, జనసేనదే కావటంతో… శ్రీనివాస వర్మ బరువు, బాధ్యతలు కూటమికే అప్పగించారు. ఇదిలా ఉంటే.. వైసీపీకి అనుకూల నిర్ణయంగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. రామకృష్ణంరాజుకు బీజేపీ టిక్కెట్టును దూరం చేయటంలో వైసీపీ కీలక పాత్ర పోషించిందని, ఒక సీనియర్ నాయకుడిని రంగంలోకి దించిందని ఇప్పటికే ప్రచారం ఊపందుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement