Tuesday, May 14, 2024

పెరగుతున్నక‌రోనా కేసులు.. మ‌రోసారి కంటైన్మెంట్‌ జోన్లు..

రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండడంతో కట్టడి చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ట్రీటింగ్‌ వ్యూహాన్ని ఒమిక్రాన్‌ కట్టడి కోసం అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఒమిక్రాన్‌ కట్టడికి కరోనా టెస్టులను పెద్ద ఎత్తున చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. ఈ మేరకు ప్రతీ రోజూ రోజువారీ కరోనా టెస్టుల సంఖ్యను 50వేలకు పెంచారు. కొద్ది రోజుల్లోనే ఈ సంఖ్యను రోజూ లక్ష టెస్టులకు పెంచనున్నారు. మరీ ముఖ్యంగా ఒమిక్రాన్‌ రిస్క్‌ ఉన్న, ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు ఎక్కువగా ఉండే హైదరాబాద్‌లోని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. హైదరాబాద్‌లో విదేశీయులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో టెస్టులు చేసేందుకు 25 బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు ముగ్గురు వైద్య సిబ్బందిని నియమించారు. ప్రత్యేక బృందాలతోపాటు మొబైల్‌ టెస్టింగ్‌ వ్యాన్లను కూడా రంగంలోకి దింపారు. ప్రస్తుతం తెలంగాణలో 38 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దాదాపు 10వేలకు మందికి పైగా కరోనా రిస్క్‌ దేశాల నుంచి తెలంగాణకు వచ్చారు. ప్రతీ రోజూ రిస్క్‌, నాన్‌ రిస్క్‌ దేశాల నుంచి తెలంగాణకు పెద్ద ఎత్తున ప్రయాణికులు వస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పారామౌంట్‌ కాలనీ, ఐఏఎస్‌ కాలనీలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించింది. కెన్యా, సోమాలియా తదితర ఆఫ్రికా దేశాల నుంచి వైద్యం కోసం హైదరాబాద్‌ వచ్చే విదేశీయులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని అపార్ట్‌ మెంట్లలో ప్రత్యేకంగా వైద్య, పరీక్షల డ్రైవ్‌ కొనసాగుతోంది. ఒక్కో వైద్య బృందానికి రెండు, మూడు అపార్ట్‌మెంట్ల చొప్పున కేటాయించి పరీక్షలు చేయిస్తున్నారు. ఒమిక్రాన్‌ దేశాల నుంచి వచ్చినప్పటికీ నెగెటివ్‌గా తేలిన వారిని మరోసారి టెస్టు చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది.

మరోసారి కంటైన్మెంట్‌ జోన్లు…
మరోవైపు కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు ఎక్కువగా తేలిన మరికొన్ని ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్లు, హాట్‌ స్పాట్లుగా ప్రకటించేందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ సన్నద్ధమవుతోంది. సాధారణ కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు 10 నమోదైతే ఆ ప్రాంతాన్ని హాట్‌స్పాట్‌గా ప్రకటించి… కొవిడ్‌ ఒమిక్రాన్‌ కిట్లను వెంటనే పంపిణీ చేయనున్నారు. ప్రతీ అయిదు హాట్‌స్పాట్లను కలిపి కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించనున్నారు. హాట్‌స్పాట్‌లు, కంటైన్‌మెంట్‌ జోన్ల విధింపుతో వైరస్‌ వ్యాప్తిని అదుపుచేయొచ్చని, వైరస్‌ వ్యాప్తి చైన్‌ను అడ్డుకోవచ్చని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అందుకే టెస్టుల ద్వారా పాజిటివ్‌లను వెంటనే గుర్తించి వారికి 14రోజుల ఐసోలేషన్‌లో ఉంచడం ద్వారా వైరస్‌ ఇతరులకు వ్యాప్తి చెందకుండా కట్టడి చేయనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement