Tuesday, July 23, 2024

IPL | ఆర్సీబీకి షాక్… ఐపీఎల్‌కు స్టార్ ప్లేయర్లు గుడ్ బై

ఐపీఎల్-2024లో ప్లేఆఫ్స్ రేసు ఆసక్తికరంగా సాగుతున్న వేళ పలు జట్లకు బిగ్ షాక్ తగిలింది. తమ జట్టులోని ఇంగ్లండ్ ఆటగాళ్లు భారత్‌ను వీడనున్నారు. జాతీయ విధుల్లో పాల్గొనేందుకు ఇండియాను వీడటానికి సిద్ధమయ్యారు. ఇప్పటీకే విల్ జాక్స్, బట్లర్ తమ జట్లకు గుడ్‌బై చెప్పి ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరారు.

మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న వరల్డ్ కప్‌కు ఇటీవల ఇంగ్లండ్ జట్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే పాకిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు కూడా అదే టీమ్‌ను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. మే 22 నుంచి పాకిస్థాన్‌తో ఇంగ్లండ్ నాలుగు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ ప్లేయర్లు ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు అందుబాటులో ఉండరని ఈసీబీ స్పష్టం చేసింది.

తమ ఆటగాళ్లు ఐపీఎల్‌ నుంచి త్వరగా స్వదేశానికి రావాలని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు ఆదేశించింది. దీంతో కొందరు ఇంగ్లండ్ ప్లేయర్లు ఐపీఎల్-2024 సీజన్‌కు గుడ్ బై చెప్పి సోమవారం తమ దేశానికి బయలుదేరారు. రాజస్థాన్ రాయల్స్ స్టార్ ప్లేయర్ బట్లర్, ఆర్సీబీ ఆల్‌రౌండర్ విల్ జాక్స్, బౌలర్ టోప్లే తమ జట్లకు బైబై చెప్పారు. మొయిన్ అలీ, బెయిర్‌స్టో, సామ్ కరన్, ఫిల్ సాల్ట్ త్వరలో ఇండియాను వీడనున్నారు.

అయితే విల్ జాక్స్ దూరమవ్వడం ఆర్సీబీకి తీరని లోటు. గత అయిదు మ్యాచ్‌ల్లో ఆ జట్టు విజయం సాధించడంలో విల్ జాక్స్‌ది కీలక పాత్ర. ఆల్‌రౌండర్ షోతో ఆర్సీబీ ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచాడు. మరోవైపు బెంగళూరు ప్లేఆఫ్స్ చేరాలంటే మే 18న జరగనున్న చెన్నై సూపర్ కింగ్స్‌ మ్యాచ్‌లో తప్పక విజయం సాధించాలి. ఈ స్థితిలో జాక్స్ ఇంగ్లండ్‌కు వెళ్లనుండటం ఆర్సీబీకి కోలుకోలేని దెబ్బగా మారింది.

ఐపీఎల్-2024కు దూరమయ్యే ఇంగ్లండ్ ఆటగాళ్లు
బట్లర్ (రాజస్థాన్ రాయల్స్), మొయిన్ అలీ (సీఎస్కే), బెయిర్‌స్టో (పంజాబ్ కింగ్స్), సామ్ కరన్ (పంజాబ్ కింగ్స్), విల్ జాక్స్ (ఆర్సీబీ), క్రిస్ జోర్డాన్, లివింగ్‌స్టోన్ (పంజాబ్ కింగ్స్), ఫిల్ సాల్ట్ (కేకేఆర్), రీస్ టోప్లే (ఆర్సీబీ).

Advertisement

తాజా వార్తలు

Advertisement