Wednesday, May 29, 2024

AP | వైసీపీకి ఇక సెలవు : చంద్రబాబు

అమరావతి, ఆంధ్రప్రభ: వైసీపీ అరాచక, అవినీతి పాలనకు గుడ్‌ బై చెప్పేందుకు ప్రజలు ఎంతగా ఎదురు చూస్తున్నారో.. తెల్లవారు జామునుండే ఓట్లు- వేసేందుకు క్యూలైన్లలో ఎదరుచూస్తున్న ప్రజలే నిదర్శనమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజల్లో వచ్చిన తిరుగుబాటుతో ఓటమి కళ్లకు కనిపిస్తుండడంతో, వైసీపీ నేతలు ఎక్కడికక్కడ దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫ్రస్టేషన్‌తో వీరంగం సృష్టిస్తూ, అడ్డదారులు తొక్కుతూ, అక్రమాలకు పాల్పడుతూ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారారని ఫైర్‌ అయ్యారు. సోమవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో కూటమి అభ్యర్థులతో పాటు మీడియాపై, పోలీసులపై కూడా దాడులకు పాల్పడుతున్నారనీ చంద్రబాబు ఆరోపించారు. మహిళా ఓటర్లు, మహిళా నేతలపై దాడులకు తెగబడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విరుచుకుపడ్డారు.

దేశ చరిత్రలో ఎన్నడూ మహిళలపై, పిల్లలపై దాడులు జరిగిన ఘటనలే లేవని, కళ్ల ముందు ఘోర పరాజయం కనిపిస్తుండడంతో వైసీపీ నేతలు దాడులకు తెగబడుతున్నారన్నారు. మాచర్లలో టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డితోపాటు వందల సంఖ్యలో కార్యకర్తలను రక్తం వచ్చేలా దాడి చేశారని, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలుపై వైసీపీ మూకలు దాడి చేసి, కార్లను ధ్వంసం చేశారని చెప్పారు.

తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు టీడీపీ నేతలపై, ఓటర్లపై కూడా దాడులకు పాల్పడడం హేయమన్నారు. గుంటూరు ఎంపీ అభ్యర్ధి కిలారు రోశయ్యను అభివృద్ధి గురించి ప్రశ్నించినందుకు మహిళలపైకి కారుతో దూసుకెళ్లడం వైసీపీ నేతల దురహంకారానికి నిదర్శనం అని చంద్రబాబు మండిపడ్డారు. చీరాలలో టీడీపీ అభ్యర్థి కొండయ్యపై, శ్రీకాకుళం అభ్యర్థి గొండు శంకర్‌పై పోలింగ్‌ బూత్‌ వద్దే దాడికి పాల్పడడం దుర్మార్గం అని ఆవేదన వ్యక్తం చేశారు.

తిరువూరు నియోజకవర్గం కంభంపాడులో కేశినేని చిన్ని బృందంపై వైసీపీ మూకలు వెంటాడి మరీ దాడి చేసి కార్లు ధ్వంసం చేశారని, పోరంకి పోలింగ్‌ కేంద్రంలో తెలుగుదేశం పార్టీకి ఓట్లు ఎక్కువగా వేస్తున్నారని జోగి రమేష్‌ తనయుడు రాజీవ్‌ ఏకంగా పోలింగ్‌ ఆపేయాలంటూ హడావుడి చేశారని అన్నారు. ఇలా ఎక్కడికక్కడ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారనీ తెలిపారు.

- Advertisement -

తెనాలిలో క్యూ లైన్‌లో రావాలన్నందుకు ఓటరుపై ఎమ్మెల్యే శివకుమార్‌, అతని కుమారుడు దాడి చేయడం దుర్మార్గం అని చంద్రబాబు మండిపడ్డారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద భయానక పరిస్థితులు సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలన్న వైసీపీ నేతల కుట్రలను పోలీసులు ఛేదించాలని కోరారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌కు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

వరుస ట్వీట్ల హోరు.. హింసాత్మక ఘటనలపై మండిపాటు..
ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు క్షణక్షణం స్పందిస్తూ వరుస ట్వీట్లు చేశారు. అధికార వైసీపీ శ్రేణులు హింసాత్మక సంఘటనలకు పాల్పడటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోమవారం ట్వీట్ల వర్షాన్ని కురిపించారు. పోలింగ్‌లో వైసీపీ హింస ఎంతవరకు వెళ్లిందంటే కనీసం పోలీసులకు రక్షణ కూడా కరువైందని ధ్వజమెత్తారు. తాడిపత్రిలో ఏకంగా ఎస్పీ వాహనంపై దాడి చేయడం టీడీపీ అభ్యర్థి అస్మిత్‌ రెడ్డిపై దాడి వైసీపీ హింసాత్మక రాజకీయాలకు పరాకష్టని గత ఐదేళ్లుగా సీఎం జగన్‌ పెంచి పోషించిన వైసీపీ రౌడీ మూకలు ఈరోజు తమ దాడులతో ప్రజల్లో భయాన్ని కలిగించి పోలింగ్‌ శాతాన్ని తగ్గించడం ద్వారా లబ్ధిపొందే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలారా ఈ కుట్రలను మీరే తిప్పికొట్టాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరు నిర్భయంగా తరలివచ్చి ఓటు వేయాలని అత్యధిక ఓటు శాతంతో వైసీపీ హింసా రాజకీయాలకు ముగింపు పలకాలని చంద్రబాబు ట్వీట్ల ద్వారా విజ్ఞప్తి చేశారు. ఇక మరోవైపు పల్నాడులో హింసాత్మక ఘటనలతో పాటు రాష్ట్రంలో పలుచోట్ల శాంతి భద్రతల విఘాతంపై కూడా ట్వీట్లు చేశారు. మాచర్లలో ఇప్పటికీ దాడులు జరగడం పోలీసుల వైఫ్యలమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడులో పోలింగ్‌ ప్రశాంతంగా నిర్వహించడంలో పోలీసులు విఫలమయ్యారని ఉదయం నుంచి ఫిర్యాదులు చేస్తున్నా శాంతిభద్రతలను కాపాడలేకపోయారని మండిపడ్డారు. ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని డిమాండ్‌ చేశారు. ఇక పల్నాడు జిల్లాలో దాడులతో పాటు అన్నమయ్య జిల్లాలో జరిగిన దాడులపై కూడా ఈసీకి ఫిర్యాదులు చేశారు. ఇదే సమయంలో ఓటర్లకు ఆయన అభినందనలు తెలియజేశారు. మండుటెండలను సైతం లెక్కచేయకుండా తెల్లవారుజామునుంచే ఓటు కోసం పె ద్ద ఎత్తున క్యూలలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను స్పస్టం చేస్తుందని చెప్పారు. వైసీపీ నేతలు అడ్డంకులు సృష్టించినా ప్రజలు లెక్కచేయకుండా ప్రజలు నిర్భయంగా ఓటింగ్‌లో పాల్గొంటున్నారని ప్రశంసించారు. వేలిపై సిరా చుక్క పడాల్సిన చోట రక్తపు చుక్కలు పడేలా చేస్తున్న వైసీపీ నేతలపై ఈసీ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇక తెనాలిలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివ కుమార్‌ దాడిపై కూడా స్పందించారు. క్యూలో రమ్మని చెప్పిన ఓటర్‌పై ఎమ్మెల్యే దాడి చేయడం దుర్మార్గమని దాడులు, దౌర్జన్యాలతో ప్రజాభిప్రాయాన్ని మార్చలేరని శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు వైసీపీ వ్యతిరేకపవనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు. ఓటమి ఖాయమని తెలియడంతో వైసీపీ అల్లర్లకు తెగబడుతుందని ఐదేళ్ల దౌర్జన్య కాండను ఎన్నికల వేళ కొనసాగిస్తూ దాడులకు పాల్పడటం ముందస్తు ఓటమిని వైసీపీ ఒప్పుకోవడమేనని చంద్రబాబు ట్వీట్‌లో పేర్కొన్నారు. పుంగనూరు, మాచర్ల, రైల్వే కోడూరు, మైదుకూరు, ఆముదాల వలస, తాడికొండలో కూటమి ఏజెంట్లపై దాడులను తీవ్రంగా స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. వైసీపీ కుట్ర లను తిప్పికొట్టాలని ప్రజలకు చంద్రబాబు ట్విట్టర్‌ వేదికగా పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement