Saturday, April 27, 2024

డ‌యోగ్నస్టిక్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రులు హరీష్ రావు, సబితారెడ్డి

రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని నార్సింగ్ సీహెచ్సీ లో మినీ తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, చంటి క్రాంతి కిరణ్, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, మున్సిప‌ల్ చైర్మన్, వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లు, వైద్యాధికారులు, పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ… నాడు ప్రభుత్వ ఆస్పత్రులకు పొతే జ్వరం, కోల్డ్ కు ఒక మాత్ర మాత్రమే ఇచ్చి పంపేవారని, నేడు అన్నిరకాల పరీక్షలు ఉచితంగా చేస్తూ, అన్ని రోగాలకు వైద్యం చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలో హబ్ లు అధికంగా ఏర్పాటు చేసినందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కు ధన్యవాదాలు తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రుల లాగా అన్ని రకాల సదుపాయాలతో ఏర్పాటు చేస్తున్న ఈ హబ్ ల గురించి కౌన్సిలర్లు ప్రజలకు చెప్పాల్సిన అవసరముంద‌న్నారు. వైద్య శాఖ తరపున ప్రత్యేక యాప్ తో ఎక్కడెక్కడ ఈ హబ్ లు ఉన్నాయో తెలుసుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రేటర్ లో బస్తీ దవాఖానాల లాగా జిల్లాలో కూడా బస్తీ దవాఖానాలు ఏర్పాటుకు కృషి జరుగుతుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప్రజలకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులే ఉండేవని, నేడు గచ్చిబౌలితో పాటు మరో 3 చోట్ల, రూ.1200 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారని ప్రజలందరి తరపున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement