Sunday, May 5, 2024

శీతాకాల విడిది కోసం తెలంగాణ‌కు రాష్ట్రపతి.. బొల్లారంలో ప్రత్యేక ఏర్పాట్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : శీతాకాల విడిదిలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం హైదరాబాద్‌ చేరుకోనున్నారు. ఈ నెల 26 నుంచి 30 వరకు సికింద్రాబాద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి నియలంలో ఆమె బస చేయనున్నారు. రాష్ట్రపతి రాక నేపథ్యంలో బొల్లారం రాష్ట్రపతి నిలయంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి నిలయాన్ని శత్రు దుర్భేధ్యంగా తీర్చి దిద్దారు. బొల్లారం రాష్ట్రపతి నిలయంలోని 6 భవనాలు, వెలుపల ఉన్న 14 భవనాలను, చుట్టూ ఉన్న ప్రాంతాలను , ఉద్యాన వనాలను అందంగా తీర్చిదిద్దారు. తాగునీటి సదుపాయాన్ని మెరుగుపరచారు. అంతర్గత రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు.

పాములు, ఇతర విష కీటకాలు ప్రవేశించకుండా ప్రత్యేక సిబ్బందిని నియమించడంతోపాటు అనేక చర్యలు చేపట్టారు. ఢిల్లి నుంచి వచ్చిన ప్రత్యేక బృదం ఇప్పటికే బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని , పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకుంది. భద్రతా చర్యల్లో భాగంగా రాష్ట్రపతి నిలయంలో ప్రత్యేక ఎన్‌క్లోజర్లను ఏర్పాటు చేశారు. బొల్లారం-సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక బందబోస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి నిలయం పరిసర ప్రాంతాల్లో నిషేదాజ్ఞలు జారీ చేశారు. పాస్‌లు ఉన్న వారిని మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు.

- Advertisement -

రాష్ట్రపతి విడిది నేపథ్యంలో హకీంపేట ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్‌ – సికింద్రాబాద్‌- రాష్ట్రపతి నిలయం- రాజ్‌భవన్‌ మార్గాల్లో ఇప్పటికే రూట్‌ కాన్వాయ్‌ రిహార్సల్స్‌ నిర్వహించారు. శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 28న రాష్ట్రపతి భద్రాద్రి రామయ్యను దర్శించుకోనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ ఏర్పాట్లను ఆదివారం పర్యవేక్షించారు. బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ గెస్ట్‌ హౌజ్‌లో రాష్ట్రపతి విశ్రాంతికి ఏర్పాట్లు చేశారు. సారపాక నుంచి భద్రాచలం వరకు వచ్చే రహదారి ప్రాంతంతోపాటు భద్రాద్రి ఆలయంలో ప్రతి భాగాన్ని పర్యవేక్షించారు.

రాష్ట్ర పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కలెక్టర్‌ కోరారు. కాగా.. యాదాద్రి లక్ష్మీ నరసింహాస్వామిని రాష్ట్రపతి దర్శించుకోనున్నారు. రాష్ట్రపతి రాక నేపథ్యంలో యాదాద్రిలోనూ అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. కొండ కింద యాగస్థలంలో హెలిప్యాడ్‌ ప్రాంగణాన్ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి, తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement