Sunday, April 28, 2024

TS | ఎన్నికల కోసం పోలీసుల యాక్షన్​ ప్లాన్​.. ఇరుగు, పోరుగు జిల్లాలతో కో ఆర్డినేషన్​!

ఉమ్మడి మెదక్​ బ్యూరో (ప్రభ న్యూస్​): తెలంగాణలో జరగబోయే సాధారణ ఎన్నికల కోసం పోలీసు అధికారులు సన్నద్ధమవుతున్నారు. రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు సరిహద్దు జిల్లాలు, రాష్ట్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా గురువారం సంగారెడ్డి ఎస్పీ ఎం రమణకుమార్​ పోరుగు రాష్ట్రమైన కర్నాటక, పక్క జిల్లాలోని ఎస్పీలు, ఇతర శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.  ఈ భేటీకి  సరిహద్ధు రాష్ట్ర బీదర్ జిల్లా ఎస్పీ చెన్నబసవన్న , కామారెడ్డి జిల్లా ఎస్పీ బి. శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. సమాచార వ్యవస్థలో పరస్పరం సమన్వయం చేసుకొంటూ.. ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవాలని సంగారెడ్డి ఎస్పీ ఎం. రమణ కుమార్ అన్నారు.

తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆదేశానుసారం సరిహద్దు జిల్లాలైన బీదర్, కలబురగి జిల్లాల ఉన్నతాధికారులతోపాటు కామారెడ్డి జిల్లా పోలీస్ అధికారులుతో జహీరాబాద్ లోని మహీంద్రా గెస్ట్ హౌజ్ లో ఎస్పీ రమణకుమార్​ భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే సాధారణ ఎన్నికల దృష్ట్యా సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏ విధమైన ప్రణాళికలను అనుసరించాలి.. ఇరు జిల్లాల అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సంఘవ్యతిరేక శక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా గురించి చర్చించారు. ఎన్నికల సమయంలో మద్యం, నగదు సరఫరా వంటి వాటి నియంత్రణ కోసం చేపట్టాల్సిన చర్యల గురించి కూడా చర్చించారు.

ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రమణ కుమార్ మాట్లాడుతూ.. సరిహద్దు ప్రాంతాల్లో ఎన్నికల ముందు, ఎన్నికల సమయంలో రాష్ట్రంలోనికి ఇతర జిల్లాల నుండి ఎలాంటి మద్యం గాని, నగదు గాని మరే ఇతర వస్తువుల అక్రమ రవాణా జరగకుండా కట్టుదిట్టంగా భద్రత ఏర్పాట్లు చూసుకోవాలని, సంఘ విద్రోహ శక్తులు జిల్లాలోనికి ప్రవేశించి అల్లర్లు సృష్టించకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. పరస్పరం సమాచార వ్యవస్థను సమన్వయం చేసుకొంటూ, ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవాడం ద్వారా అనేక రకాల నేరాలను అరికట్టవచ్చు అన్నారు.  సరిహద్దు ప్రాంతాల్లో ప్రవేశించడం.. ఇక్కడినుంచి వెళ్లే మార్గాలలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పకడ్బందీగా తనిఖీలు చేపట్టాలన్నారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడే  నేరస్తులపై ప్రత్యేక నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

- Advertisement -

ఎన్నికలు సజావుగా జరగడంలో తమ వంతు పాత్ర కచ్చితంగా అవసరం అని బీదర్ జిల్లా ఎస్పీని కోరారు. అనంతరం బీదర్ జిల్లా ఎస్పీ చెన్నబసవన్న మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్ర ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించుకోవడంలో తెలంగాణ పోలీసుల పాత్ర ఎంతగానో ఉందన్నారు. అందుకు తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖకు కృతజ్ఞతలు తెలియజేశారు. కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు ఏవిధంగానైతే ప్రశాంతంగా నిర్వహించుకున్నామో.. అధేవిధంగా తెలంగాణలో జరగబోయే ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించుకోవడంలో అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు.  ఈ సమావేశంలో సంగారెడ్డి జిల్లా అదనపు ఎస్పీ పి.అశోక్, జహీరాబాద్ ఆర్డీవో వెంకారెడ్డి, నారాయణ్ ఖేడ్ ఆర్డీవో వెంకటేశ్,  జహీరాబాద్ డీఎస్పీ రఘు, నారాయణ్ ఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, డీఎస్పీ పవర్ శెట్టి బాల్కీ, సంగారెడ్డి ఎఫ్​ఆర్​వో రాధిక రెడ్డి, నారాయణ్ ఖేడ్ ఎఫ్​ఆర్​వో చేంద్రశేఖర్, మద్నూర్ ఎంవీఐ సుభాష్, ఎస్​బీ ఇన్స్పెక్టర్ శివలింగం ఇతర జిల్లాల ఇన్​స్పెక్టర్లు,ఎస్​ఐలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement