Sunday, May 19, 2024

కరోనా కట్టడిలో మన బడులు సేఫే.. కేసులు పెరుగుతున్న స్కూళ్లకు రాకుండా చర్యలు!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో కరోనా కేసులను కట్టడి చేయడంలో పాఠశాలలు మంచి ఫలితాలను రాబడుతున్నాయి. తద్వారా నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల్లో విద్యార్థులు ఉండడంలేదని తెలుస్తోంది. తెలంగాణలో కేసులు పెరుగుతున్నప్పటికీ విద్యార్థులు పెద్దగా కరనా బారినపడకపోవడం ఊరటకలిగించే అంశం. రాష్ట్రంలో బడులు జూన్‌ 13 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. పాఠశాలలు ప్రారంభమై 30 రోజులు కావొస్తున్న ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్‌ బడుల్లో పెద్దగా కరోనా కేసులు నమోదు కాలేదు. అధికారులు కూడా వీటి గురించి ఎక్కడా ప్రకటించలేదు. మూడు వారాల నుంచి రాష్ట్రంలో కరోనా కేసులు తీవ్రత పెరిగింది. ప్రతి రోజూ 500 నుంచి 600 మధ్య కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఫోర్త్‌ వేవ్‌ రాబోతోందనే ఆందోళన ప్రజల్లో నెలకొంది. థార్డ్‌ వేవ్‌లో రెసిడెన్షియల్‌ స్కూళ్లల్లో ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదైన విషయంత తెలిసిందే. కానీ ప్రస్తుతం పాఠశాలలు పున:ప్రారంభమై ఇన్ని రోజులవుతున్నా థార్డ్‌ వేవ్‌ స్థాయిలో పాజిటివ్‌ కేసులు పాఠశాలల్లో నమోదుకాకపోవడం అటు విద్యార్థుల తల్లిదండ్రులకు ఇటు అధికారులకు ఊరటకల్గించే అంశం.

ఈనెల 9న రాష్ట్రంలో 528 కేసులు నమోదయ్యాయి…

రాష్ట్రంలోని దాదాపు వంద శాతం స్కూళ్లు వ్యాక్సినేషన్‌ను పూర్తి చేసుకున్నాయి. టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ సిబ్బంది ఫస్ట్‌, సెకండ్‌ డోస్‌లతో పాటు బూస్టర్‌ డోస్‌లు తీసుకుంటున్నారు. కరోనాను కట్టడి చేయడంలో వ్యాక్సినేషన్‌ మంచి ఫలితాలను రాబడుతున్నాయి. అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రుల్లో కరోనా నిబంధనలపై అవగాహన పెరగడంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాధారణంగా ఫోర్త్‌ వేవ్‌ వస్తే రోజుల వ్యవధిలోనే కేసులు భారీగా పెరుగుతాయి. కానీ నెల రోజులవుతున్నా రాష్ట్రంలో 550 కంటే మించడంలేదు. మరోవైపు రాష్ట్రంలో అర్హత ఉన్న విద్యార్థులను టీకాలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ పేర్కొంటోంది. ఈక్రమంలోనే 12నుంచి14 ఏళ్ల విద్యార్థులకు టీకాలు వేయడం కూడా పాజిటివ్‌ కేసులు పెరగకుండా కట్టడి చేయగలుగుతున్నట్లు వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాలల్లోని ప్రభుత్వ, స్థానిక సంస్థల సర్కారు బడులు, మోడల్‌ స్కూళ్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్లు, కేజీబీవీ, యూఆర్‌ఎస్‌, ఎయిడెడ్‌, వెల్ఫేర్‌ పాఠశాలలు, ప్రైవేట్‌ స్కూళ్లు కలిపి మొత్తం 41,220 ఉన్నాయి. వీటిలో బోధన, బోధనేతర సిబ్బంది కలిపి మొత్తం కలిపి 3,74,341 మంది ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీరందరూ ఇప్పటికే వ్యాక్సినేషన్‌ తీసుకున్నారు.

అయినా జాగ్రత్తలు అవసరం..

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో దాదాపు 60 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలల్లో కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నప్పటికీ అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు అయినప్పటికీ పాఠశాలకు విద్యార్థులు, టీచర్లు, సిబ్బంది వచ్చేటప్పుడు వారికేమైనా కోవిడ్‌ లక్షణాలు ఉన్నాయా..లేదో పరీక్షించుకోవాలని సూచిస్తున్నారు. విద్యార్థులు తమ పెన్నులు, పెన్సిళ్లు, రబ్బర్లు, పుస్తకాలు, ఫుడ్‌, వాటర్‌ బాటిళ్లు, గ్లాసులు, ప్లేట్లు ఇచ్చిపుచ్చుకోవడం చేయకూడదు. స్కూల్‌ బస్సులను శానిటైజ్‌ చేసుకొవాల్సి ఉంటుంది. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. ఒకవేళ కోవిడ్‌ సోకితే మిగతా విద్యార్థులను, సిబ్బందిని సమీపంలో ఉన్న ఆరోగ్య కేంద్రంలో ఆర్టీపీసీఆర్‌/ర్యాట్‌ పరీక్షలు చేయించాలి.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement