Tuesday, May 14, 2024

No Contest – తెలంగాణ‌లో చంద్ర‌బాబు చ‌క్ర‌వ్యూహం…ఫ‌లిస్తుందా? విక‌టిస్తుందా?

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: భాజపాకు తెలంగాణలో తెలుగుదేశం మద్దతు లేదని స్పష్టమైంది. అలాగే, భారాసకు కూడా వ్యతిరేకంగా శ్రేణులు నిలబడాలని సూచిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో తనకు తోడుగా నిలిచిన జనసేనతో కలిసి తెలంగాణలో అడుగులు వేసేది లేదని కూడా తేల్చివేసింది! ఈ ఎన్నికల్లో తెదేపా బరిలో నిలబడితే ఆశించిన ఫలితాలు, ప్రయోజనాలు దక్కవని అధినేత చంద్రబాబు తలపోస్తున్నారు. అందుకే తెలంగాణలో బరిలోకి దిగడం లేదని స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌కు నచ్చజెప్పారు! ఈ ఎత్తుగడల గురించి విశ్లేషిస్తూ ఆంధ్ర ప్రభ ముందే కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో ఎటుబోయి ఎటువచ్చినా ఒకప్పటి తన అనుంగు అనుచరుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షుడుగా ఉన్న కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే ఈసారి ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో తనకు అండ లభిస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు! గత ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా తనకు వ్యతిరేకంగా బరిలో ఉండడం, పైగా… నిఘా విభాగాలన్నీ తనకు వ్యతిరేకంగా పనిచేయడంతో పోలింగ్‌ మేనేజ్‌మెంట్‌లో చంద్రబాబుకు ఊపిరాడలేదు! ఆ ఎన్నికల్లో తెదేపా చిత్తుగా ఓడడానికి తెలంగాణ నుంచి కేసీఆర్‌, కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా చెరోపక్క వైకాపాకు అండగా నిలబడడమే కారణమని ఆయన ఇప్పటికీ నమ్ముతున్నారు!

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే మే నెలలో జరుగనున్న అసెంబ్లిd ఎన్నికల్లో ఈసారి తెదేపా గెలవకపోతే రాజకీయ యవనికపై కనుమరుగు కావడం తథ్యమన్న విశ్లేషణలు ఇప్పటికే సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టయ్యారు. మరోపక్క వైకాపాపై కత్తులు నూరుతున్న జనసేనాని ఏకంగా రాజమండ్రి జైలుకు వెళ్లి చంద్రబాబుకు మద్దతు ప్రకటించడమే కాకుండా, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా, తమతో భాజపా కలిసివస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అయితే, దాదాపు రెండు నెలలు గడుస్తున్నా భాజపా ఈ ప్రతిపాదనపై నోరెత్తలేదు!

ఈలోగా తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్‌ వచ్చింది. చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత తెలంగాణలో సెటిలర్ల ఓట్లు చాలా స్థానాల్లో గెలుపోటములను నిర్ణయిస్తాయని గ్రహించిన ఆయా పార్టీలు ముఖ్యంగా భాజపా వారిని ఆకర్షించే ప్రయత్నంలో పడింది. ఇందులో భాగంగానే ఏపీ భాజపా అధ్యక్షురాలు పురందేశ్వరితో పావులు కదిపారు. కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌షాతో పురందేశ్వరి, కిషన్‌రెడ్డితో కలిసి లోకేష్‌ను వెంటపెట్టుకుని వెళ్లి హస్తినలో కలిశారు. కాని, ఆశించిన స్పందన రాలేదు. తెదేపా సానుభూతిపరులు అటు భాజపా, ఇటు భారాసలకు వ్యతిరేకంగానే ఉన్నట్టు పరిశీలకులు చెబుతున్నారు. అంతేకాకుండా, భాజపా, భారాసలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రేవంత్‌ రెడ్డికి అన్నివిధాలుగా మద్దతుగా నిలుస్తున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తెలంగాణ నుంచి పలువురు తెదేపా సామాజికవర్గానికి చెందిన పెద్దలు ఇటీవల భువనేశ్వరిని కలిశారు. తెలంగాణలో పరిస్థితులను వివరించారు. బరిలో నిలిస్తే సీట్లు గెలవడం సంగతి అటుంచి సానుభూతిపరులు కూడా ఓట్లు వేసే పరిస్థితి ఉందని చెప్పారు. గెలిచే అవకాశం లేనప్పుడు ఓడిపోయే అభ్యర్ధికి ఓట్లు వేసి ప్రయోజనం ఏమిటని, రేవంత్‌ రెడ్డిని ఇప్పటికే తమ నేతగా వారంతా భావిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో బరిలో నుంచి తప్పుకుంటే ఇటు భాజపా, అటు భారాసకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌కు గెలిచే అవకాశాలు మరింత పెరిగే అవకాశాలు ఉంటాయని వివరించారు. రేపు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడితే అటు ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో తెదేపాకు లాభిస్తుందని స్పష్టం చేశారు. ఈ విశ్లేషణలను భువనేశ్వరి తెదేపా అధినేతతో చర్చించారు. చివరకు బరిలో నుంచ తప్పుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు!

అయితే, ఇక్కడే చంద్రబాబు తన వ్యూహాన్ని మరింత విస్తరించినట్టు చెబుతున్నారు! ఏపీలో తనతో కొనసాగుతున్న జనసేన తెలంగాణలో బరిలో దిగుతోంది. భాజపాతోనూ పొత్తు కుదుర్చుకునేందుకు చర్చలు జరుపుతోంది. రేపో మాపో సీట్ల సర్దుబాటు కూడా జరుగవచ్చు! ఆంధ్రప్రదేశ్‌లో తనతో పొత్తు కుదుర్చుకుంటూ తెలంగాణలో భాజపాతో కలిసి వెళ్లడంపై చంద్రబాబు దృష్టి సారించారు! ఏపీలో ఇప్పటికే ఒంటరిగా పోటీలో నిలబడాలని, ఒంటరిగా పోటీ చేసినా తెదేపా గెలుపని పలు సర్వేలు స్పష్టం చేశాయని కొందరు ఆయన చెవిలో ఇల్లు కట్టుకుని మరీ చెబుతున్నారు! పైగా జనసేనతో ఓకే కాని, భాజపాతో కూడా కలిస్తే అది తమకు ఎంతో నష్టం కలిగిస్తుందని, అయిదేళ్లుగా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అధికార వైకాపాతో భాజపా పెద్దలు ఏవిధంగా మద్దతుగా నిలిచిందీ వారు ఉదహరిస్తున్నారు. ఇంత జరిగినా ఇంకా భాజపాతోనే వెళితే జనంలో ఇప్పటికే ఉన్న నిరసన భావం వ్యతిరేకతగా మారి మళ్లిd అధికార వైకాపాకే వరంగా మారుతుందని వారు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు!

- Advertisement -

తెలంగాణలో తెదేపా బరిలో నిలబడకపోతే ఆ పార్టీ సానుభూతిపరుల ఓట్లన్నీ రేవంత్‌కు మద్దతుగా కాంగ్రెస్‌కే పడతాయని భాజపా కూడా ఊహిస్తోంది! అంటే తెదేపా తనకు వ్యతిరేకంగా పావులు కదుపుతోందని స్పష్టమవుతోంది! దీంతో ఇప్పుడు జనసేనపై ఒత్తిడి పెంచినట్టయింది! ఏపీలో తెదేపాతో తెలంగాణలో భాజపాతో నడుస్తున్న జనసేనకు ఇది విశ్వసనీయతకు సంబంధించిన అంశంగా మారుతోంది! ఇప్పుడు భాజపానా? తెదేపానా? అని తేల్చుకోవాల్సిన అనివార్యతను చంద్రబాబు జనసేనాని పవన్‌కల్యాణ్‌కు కల్పించినట్టయిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు! ఎందుకంటే రెండు పడవల మీద రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగా పయనించడం జరిగితే జనసేన ఓట్ల బదిలీ సజావుగా జరుగుతుందా? అన్నది ఇక్కడ ప్రశ్నార్ధకం!

Advertisement

తాజా వార్తలు

Advertisement