Monday, April 29, 2024

Travels Mafia – ప‌న్నుఎగ‌వేయలా…చ‌లో నాగాల్యాండ్

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్రానికి చెందిన పలు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ యాజమాన్యా లు తమ తమ బస్సుల రిజిస్ట్రేషన్‌ను నాగాల్యాండ్‌ పేరుతో మార్పు చేసుకునేందుకు పోటీ పడుతున్నా రు. ఆ రాష్ట్రంలో ట్రాన్స్‌పోర్ట్‌ ట్యాక్స్‌ తక్కువగా ఉండటం, దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆ ప్రాంతం లో ట్రావెల్స్‌ ప్రతి మూడు మాసాల కు చెల్లించే పన్ను మరింత తక్కువ. దీంతో ఏపీకి చెందిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ పోటీపడి నాగాలాండ్‌ రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. దీంతో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ నుంచి ప్రతి మూడు మాసాలకు రాష్ట్రప్రభుత్వానికి వచ్చే ట్యాక్స్‌ల రాబడికి గండి పడే ప్రమాదం కనిపిస్తుంది. ఏపీలో ఒక ట్రావెల్‌కు సంబంధించి ప్రతి మూడు మాసాలకు సీటుకు రూ. 3300 వంతున క్వాటర్లీ ట్యాక్స్‌ రూ. లక్ష నుంచి రూ. లక్షా 50 వేల వరకు ప్రభుత్వానికి చెల్లించాలి. అయితే నాగాల్యాండ్‌లో అంతకంటే తక్కువ ట్యాక్స్‌ చెల్లిస్తే దేశంలో అన్ని రాష్ట్రాల్లో ట్రావెలింగ్‌ చేసేలా ఆలిండియా పరిమిట్‌ లభిస్తుంది.

రాష్ట్రంలో ట్యాక్స్‌ చెల్లించినా పొరుగున ఉన్న తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలకు ఏపీ ట్రావెల్స్‌ వెళ్లాలంటే రాష్ట్ర సరిహద్దులో ట్యాక్స్‌ చెల్లించాలి. దీంతో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ యాజమాన్యం ఏపీ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసుకుని నాగాల్యాండ్‌ రిజిస్ట్రేషన్‌ను చేయించుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయం భారీగా తగ్గే ప్రమాదం కనిపిస్తుంది. ఇదే సందర్భంలో ఆ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌ల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ఆదాయం కూడా దారి మళ్లుతోంది. అయితే ప్రైవేట్‌ ట్రావెల్స్‌ యాజమాన్యం ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేలా కొత్త పంథాతో ముందుకు వెళ్లడం వెనుక బలమైన కారణాలు లేకపోలేదు. గతంలో ఇదే తరహాలో పెద్ద ఎత్తున ప్రైవేట్‌ ట్రావెల్స్‌ నాగాల్యాండ్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఏపీలో రాకపోకలు సాగించేవి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనూ నిత్యం వందలాది బస్సులు రాకపోకలు సాగించడంతో పాటు పండగ సందర్భాల్లో ట్రావెల్స్‌ సంఖ్యను పెంచి టికెట్ల రేట్లను కూడా అమాంతంగా పెంచేవారు.

దీంతో అప్పట్లో అధికారంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తం గా ప్రైవేట్‌ ట్రావెల్స్‌పై దాడులు జరిపి నాగాల్యాండ్‌ రిజిస్ట్రేషన్‌తో ఉన్న బస్సులను సీజ్‌ చేశారు. దీంతో ప్రైవేట్‌ యాజమాన్యం అప్పట్లో ట్రాన్స్‌పోర్ట్‌ అధికారులతో పాటు ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరిపి నాగాల్యాండ్‌ రిజిస్ట్రేషన్‌ని రద్దు చేసుకుని ఏపీ రిజిస్ట్రేషన్‌తోనే రాష్ట్రప్రభుత్వానికి క్వాటర్లీ ట్యాక్స్‌ను కట్టేలా అంగీకారానికి వచ్చారు. దీంతో అప్పట్లో ట్రావెల్స్‌ నుంచి ప్రతి ఏటా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ట్యాక్స్‌ల రూపంలో ఆదాయం కూడా వచ్చేవి. అయితే గత కొంతకాలంగా ఏపీ రిజిస్ట్రేషన్‌తోనే ట్రావెల్స్‌ నిర్వహిస్తున్న కొంతమంది బడాబాబులు తాజాగా నాగాల్యాండ్‌ బాట ప డుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 12 శాతం పైగా ట్రావెల్స్‌ అదేదారి..

రాష్ట్రంలో ఏపీఎస్‌ఆర్టీసీకి సంబంధించి సుమారు 13 వేలకు పైగా బస్సులున్నాయి. ఈ వాహనాలు నిత్యం ఏపీలోని అన్ని జి ల్లాలతో పాటు పొరుగున ఉన్న తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు కూడా రాకపోకలు సాగిస్తుంటాయి. అలాగే ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు సంబంధించి 3 వేల వరకు బస్సులున్నాయి. వీటిలో ముఖ్యంగా 15 ట్రావెల్స్‌కు సంబంధించి 50 నుంచి 100 బస్సులుండగా.. మరికొన్ని చిన్న ట్రావెల్స్‌ ఉన్నాయి. అయితే 50 బస్సులకు పైగా నడుపుతున్న పెద్ద ట్రావెల్స్‌లో కొన్ని బస్సులను నాగాల్యాండ్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12 శాతం పైగా ప్రైవేట్‌ ట్రావెల్స్‌ నాగాల్యాండ్‌ రిజిస్ట్రేషన్‌తోనే ఏపీలో నడుస్తున్నట్లు తెలుస్తోంది. వీరిబాటలోనే మరికొన్ని ట్రావెల్స్‌ కూడా రిజిస్ట్రేషన్‌ మార్పుకు దరఖాస్తులు చేసుకుంటున్నారు. అదే జరిగితే నాగాల్యాండ్‌ రిజిస్ట్రేషన్‌తో ఏపీలో తిరిగే ట్రావెల్స్‌ సంఖ్య మరింత పెరగనుంది.

- Advertisement -

రిజిస్ట్రేషన్ల మార్పుతో.. ఏపీకి తగ్గుతున్న ట్యాక్స్‌ ఆదాయం
ప్రతిఏటా ట్రావెల్స్‌ నుంచి రాష్ట్రప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం లభిస్తోంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి క్వాటర్లీ ట్యాక్స్‌ కింద ప్రతి బస్సు సీట్ల సామర్థ్యాన్ని బట్టి రూ. లక్ష నుంచి రూ. లక్షా 50 వేలు వరకు ట్యాక్స్‌ చెల్లించాలి. అలా ఏడాదికి నాలుగు క్వార్టర్లు వంతున ఒక్కొక్క వాహనం నుంచి రూ. 4 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు ట్యాక్స్‌ల రూపంలో ఖజానాకు రాబడి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆ ట్యాక్స్‌లను ఎగవేసేందుకు కొన్ని ప్రైవేట్‌ ట్రావెల్స్‌ యాజమాన్యాలు నాగాల్యాండ్‌ బాట పడుతున్నాయి. ఏపీ రిజిస్ట్రేషన్‌ని రద్దు చేసుకుని నాగాల్యాండ్‌ పేరుతో ఏపీలో తమ బస్సులను తిప్పుతున్నాయి. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. మరికొన్ని ట్రావెల్స్‌ కూడా అదేబాటలో పయనిస్తుండటంతో రానున్న రోజుల్లో ఆదాయం మరింత కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. ఆ రాష్ట్రంలో లక్ష నుంచి రెండు లక్షల రూపాయల ట్యాక్స్‌ చెల్లిస్తే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ట్రావెల్స్‌ను నడుపుకునే అవకాశం ఉంటుంది. దీంతో కొన్ని ట్రావెల్స్‌ ఆ రాష్ట్రంలో తప్పుడు అడ్రస్‌లు పుట్టించి రిజిస్ట్రేషన్‌ మార్పు చేసుకుంటున్నారు. ప్రత్యేకించి నవంబర్‌ మాసం నుంచి కార్తీక మాసం ప్రారంభం కానుంది. జనవరి వరకు మూడు నెలల పాటు శబరిమల యాత్రలకు డిమాండ్‌ పెరుగుతుంది. ఆ సమయంలో ఎక్కువ మంది అయ్యప్ప భక్తులు ప్రైవేట్‌ ట్రావెల్స్‌లోనే శబరిమల యాత్రకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలకు ట్రావెల్స్‌ వెళ్లాలంటే ఏపీతో పాటు పై మూడు రాష్ట్రాల్లోనూ ట్యాక్స్‌ చెల్లించాలి. ఆ పన్నును కూడా ఎగవేసేందుకు ట్రావెల్స్‌ పక్కా ముందస్తు పథకంతో నాగాల్యాండ్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఆలిండియా అనుమతులు తీసుకుంటుంది. దీంతో రాష్ట్రంతో పాటు పై మూడు రాష్ట్రాల్లో కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. రాష్ట్రానికి చెందిన అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్‌ ట్రావెల్స్‌పై ఆకస్మిక తనిఖీలు జరిపితే రిజిస్ట్రేషన్ల మార్పు బండారం వెలుగులోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement