Sunday, May 26, 2024

Andhra Pradesh – స్టాప్ న‌ర్సుల పోస్టుల కోసం న‌కిలీ స‌ర్టిఫికెట్స్ ‘మాయ‌’…

అమరావతి, ఆంధ్రప్రభ: స్టాఫ్‌నర్స్‌ పోస్టింగ్స్‌ లో కోవిడ్‌ సర్టిఫికెట్స్‌తో ‘మాయ’ చేయాలను కున్న నకిలీ అభ్యర్థుల కథ అడ్డం తిరిగింది. స్టాఫ్‌ నర్స్‌ పోస్టులకు సంబంధించి కోవిడ్‌ సమయం లో విధులు నిర్వర్తించినట్లు ఫేస్‌ సర్టిఫికెట్లు పెద్దఎత్తున పెట్టారనే అభియోగాలు ఉన్నాయి. దళారుల డైరెక్షన్లో అత్యధిక శాతం అభ్యర్థులు తాము కోవిడ్‌ సమయంలో ప్రభుత్వాసుపత్రు ల్లో విధులు నిర్వర్తించినట్లు సర్టిఫికెట్లు జత చేశారనేది బహిరంగ రహస్యం. ఆదివారం జోన్‌ 2 పరిధిలోని మెరిట్‌ లిస్ట్‌ను ప్రకటించారు. విశాఖపట్నం, గుంటూరు, కడప రీజియన్లలో మరో రెండు రోజుల్లో జాబితాలను ప్రకటించేందుకు ఆర్డీ కార్యాలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నాలుగు రీజియన్ల పరిధిలో బోగస్‌ కోవిడ్‌ సర్టిఫికెట్లతో దొడ్డిదారిన పోస్టింగ్స్‌ దక్కేలా దళారులు పావులు కదిపినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఆర్డీ కార్యాలయ అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కోవిడ్‌ సర్టిఫికెట్ల విషయంలో రుజువులు చూపాలంటూ ఆంక్షలు విధించారు. అభ్యర్థులు జత చేసిన కోవిడ్‌ సర్టిఫికెట్‌ అసలా లేక నకిలీనా అని తలుసుకొనేందుకుగాను ప్రభుత్వాసుపత్రుల్లో వారు పనిచేసిన కాలానికి సంబంధించి అటెండెన్స్‌, శాలరీ బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌లు ఈనెల 1వ తేదీ లోపు సంబంధిత అధికారికి చూపాలంటూ రాజమండ్రి ఆర్డీ కార్యాలయ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కౌన్సిలింగ్‌లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయిన తరువాత వారికి పోస్టింగ్స్‌ సమయంలో వారు సమర్పించిన ఆసుపత్రుల నుంచి పూర్తి నివేదిక తెప్పించుకొని పోస్టింగ్స్‌ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. కోవిడ్‌ సర్టిఫికెట్‌ లేదా బ్యాంక్‌ అకౌంట్‌, అటెండెన్స్‌లో మాయ చేసినట్లు రుజువైతే సంబంధిత అభ్యర్థిపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలనే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.

మేనేజ్‌ చేస్తామంటూ అదనపు వసూళ్ళు
స్టాఫ్‌ నర్స్‌ పోస్టింగ్‌ ఇప్పిస్తామంటూ దళారులు దందాకు తెరలేపారు. ఒక్కో పోస్టుకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల చొప్పున వసూలు చేసినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కాంట్రాక్ట్‌ ప్రాతిపదినక విధులు నిర్వహించే స్టాఫ్‌ నర్సుకు రూ.38,720 జీతం కావడంలో ఈ పోస్ట్‌లకు భారీగా డిమాండ్‌ ఏర్పడింది. నోటిఫికేషన్‌ వస్తోందని ముందస్తు సమాచారం అందుకున్న దళారీ బ్యాచ్‌ మూడు నెలల ముందు నుంచే రంగంలోకి దిగి అభ్యర్థుల నుంచి దండిగా వసూళ్ళు చేశారని తెలుస్తోంది. కోవిడ్‌ సమయంలో ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించినట్లైతే ఆరు నెలలకుగాను ఐదు మార్కులు, ఆ తరువాత అదనంగా ప్రతి నెలకు 0.83 మార్కుల చొప్పున లెక్కించి మొత్తంగా వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్‌ జాబితాను అధికారులు రూపొందించారు. తమ వద్దకు వచ్చిన అభ్యర్థుల దరఖాస్తుకు కోవిడ్‌ సర్టిఫికెట్‌ను జత చేసి అప్లై చేయించిన దళారీ బ్యాచ్‌ ఇప్పుడు ఏం చేయాలనే దానిపై భారీ స్కెచ్‌ వేసే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. ఇందుకు కొందరు నర్సింగ్‌ యూనియన్‌ నాయకుల సహకారంలో ఆర్డీ కార్యాలయ అధికారుల్ని మేనేజ్‌ చేసేందుకు ముమ్మరంగా పావులు కదుపుతున్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది. కోవిడ్‌ బోగస్‌ సర్టిఫికెట్ల సూత్రదరులైన దళారీ బ్యాచ్‌ ఒక స్టాంప్‌ తయారు చేసి ఆసుపత్రి సూపరింటెండెంట్‌, ఎస్‌ఆర్‌ఎం, ఆర్‌ఎంఓ సంతకాలను ఫోర్జరీ చేసి ఒక్కో సర్టిఫికెట్‌కు అభ్యర్థుల నుంచి రూ.10 వేలు చొప్పున వసూలు చేశారనే అభియోగాలు ఉన్నాయి. ఇప్పుడు బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌, అటెండెన్స్‌ విషయంలో అధికారుల్ని మేనేజ్‌ చేయాలంటూ అభ్యర్థుల నుంచి మరో లక్ష గుంజే పనిలో పడ్డట్లు తెలుస్తోంది.

కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు
కాంట్రాక్ట్‌ ప్రాతిపది కన రాష్ట్రంలోని నాలుగు జోన్ల పరిధిలో 434 మంది స్టాఫ్‌ నర్సుల భర్తీకి పబ్లిక్‌హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ గత నెల 22వ తేదీన నోటిఫికేషన్‌ జారీ చేసింది. జోన్‌-1లో 186, జోన్‌-2లో 220, జోన్‌-3లో 34. జోన్‌-4లో 94 పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని ఆహ్వానించారు. ఖాళీల సంఖ్యను డిపార్ట్‌ మెంట్‌ అవసరాలను బట్టి పెంచడం లేదా తగ్గించడం జరుగుతోందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌ వైఫరీ మరియు బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనేందుకు అర్హులుగా పేర్కొన్నారు. ఈనెల 5వ తేదీ లోపు దరఖాస్తులు అందజే యడానికి తుది గడువగా నిర్ణయించగా రాజమహేంద్రవరం, విశాఖపట్నం, గుంటూరు, కడప లోని ఆర్డీ కార్యాలయాలకు కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు అందాయి. 434 పోస్టులకుగాను సుమారు 25 వేల దరఖాస్తులు అందాయంటే ఈ పోస్టులకు ఎంత డిమాండ్‌ ఉందో అర్థం అవుతోంది. రాజమండ్రి జోన్‌ మెరిట్‌ జాబితా ప్రకటించగా, విశాఖపట్నం, గుంటూరు, కడప జోన్ల పరిధిలో ఒకటి రెండు రోజుల్లో జాబితాలను ప్రకటించనున్నారు.

ఈక్రమంలో బోగస్‌ సర్టిఫికెట్లపై అధికారులు నిస్పక్షపాతంగా విచారణ చేస్తే తప్ప అర్హులకు న్యాయం జరగదన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో బోగస్‌ కోవిడ్‌ సర్టిఫికెట్లతో పలువురు పోస్టింగ్స్‌ దక్కించుకున్నారన్నది బహిరంగ రహస్యం. వీటిపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశించాలన్న డిమాండ్‌ ఉన్నప్పటికీ ఆర్డీ కార్యాలయ అధికారులు సీరియస్‌గా తీసుకోలేదు. దీంతో నకిలీ సర్టిఫికెట్లతో ఎంచక్కా ఉద్యోగాలు చేస్తున్నారు. వీటిపై కూడా సమగ్ర దర్యాప్తు చేసినట్లైతే అర్హులకు మరింత న్యాయం జరుగుతోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement