Sunday, May 5, 2024

మోసపోయాం.. మాకు న్యాయం చేయండి సారూ..!

ఆశకు పోయి మోసపోయామని న్యాయం చేయాలని కలెక్టరేట్ లో లాటరీ బాధితులు, ఏజెంట్లు కలెక్టర్ ను కోరారు. నిజామాబాద్ నగరంలోని కలెక్టరేట్ కు ఆర్మూర్, జక్రాన్ పల్లి తదితర మండలాల నుంచి లాటరీ బాధితులు, ఏజెంట్లు అధిక సంఖ్యలో తరలివచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఆలిస్ ఎంటర్ప్రైజెస్ పేరుతో సుమారు రూ.5 కోట్లకు పైగా లాటరీ డబ్బులతో ఎంటర్ప్రైజెస్ నిర్వాహకులు బోర్డ్ తిప్పేశారు. దీంతో డబ్బులు కట్టిన అమాయక ప్రజలు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ప్రజావాణిలో కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఆశకు పోయి కోట్ల రూపాయలకు మోసపో యామని అలీస్ ఎంటర్ప్రైజెస్ నిర్వాహకులపై ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసామని తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదై 11 నెలలు గడిచిన ఎలాంటి న్యాయం జరగలేదని వాపోయారు.

ఆర్మూర్ ప్రాంతా నికి చెందిన సుల్తాన్ అలీ.. అతని భార్య ఫాతిమా డ్వాక్రా గ్రూప్ మహిళా సభ్యురాలుగా అందరినీ మభ్యపెట్టి కల్లబొల్లి మాటలు చెప్పి లాటరీ కట్టించిందని తెలిపారు. అలీస్ ఎంట ర్ప్రైజెస్ పేరుతో, ఏజెంట్ల ద్వారా నెలకు రూ.1000 చొప్పున ఒక్కొక్కరి నుండి, 16 నెలల కాలపరిమితితో లాటరీ డబ్బులు కట్టినట్లు బాధితులు తెలిపారు. మొత్తం 2800 మంది సభ్యుల నుండి కోట్లల్లో డబ్బులు కాజేసి బోర్డు తిప్పేసి పరారయ్యాడని బాధితులు వాపోతున్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలు ఎన్నో ఆశలతో బహుమతులు వస్తాయని లాటరీ స్కీం కట్టినట్లు తెలిపారు. మా డబ్బులు మాకు ఇప్పించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కలెక్టర్, పోలీసులు వెంటనే స్పందించి విచారణ చేపట్టి మా డబ్బులు మాకు ఇప్పించి మమ్మల్ని ఆదుకోవాలని బాధితులు కోరారు. అమర్, ఫిరోజ్, వినోద్,రాధ, సుజాత, మౌనిక, రవి, బాధితులు, ఏజెంట్లు అధిక సంఖ్యలో నిరసన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement