Wednesday, May 15, 2024

మోత్కూర్ పెద్ద చెరువుకి జలకళ – ఆనందంలో ఆయకట్టు రైతులు

మోత్కూర్, జూలై 26 (ప్రభ న్యూస్) ఎడతెరిపి లేని వర్షాలు ,ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో మోత్కూర్ ప్రాంతంలో ఓ పక్క బిక్కేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తుండగా… మరోపక్క మున్సిపల్ కేంద్రంలోని నివాస గృహాల మధ్య బృందావన్ కాల్వ ద్వారా వరద నీరు మోత్కూర్ పెద్ద చెరువులోకి చేరుతుండడంతో బిక్కెరు, పెద్ద చెరువు, మూసి ఆయకట్టుకు చెందిన మోత్కూర్,ఇంగిసమ్మ కుంట,కొండగడప, సదర్శపూర్,చిన్నపడిశాల,పొడిచేడు,దత్తప్పగూడెం, దాచారం,డి రేపాక, లక్ష్మీదేవి కాల్వ,మానాయి కుంట, గట్టు సింగారం, వెల్దేవితో పాటు ఆయా గ్రామాల రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో భూగర్భ జలాలు సమృద్ధిగా పెరిగి తాగు, సాగునీటికి ఎలాంటి కొరత లేకుండా పోయింది. మోత్కూర్ పెద్ద చెరువు పక్కన మోత్కూర్-తిరుమలగిరి రహదారి ఉండడం,కోటి 50 లక్షలతో మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేయడంతో నిండు కుండలా మారిన పెద్ద చెరువు ను బస్సులు,వాహనాల్లో హైదరాబాద్ కి వెళ్లే ప్రయాణికులు, స్ధానిక ప్రజలు,యువకులు, మహిళలు, చిన్నారులు పెద్దచెరువు ను వీక్షిస్తున్నారు.

పొడిచేడు -అమ్మనబోలు మధ్య మూసి నది సైతం హైదరాబాద్ లో కురిసిన కుండపోత వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తుంది. మోత్కూర్ మండలం కేవలం వర్షాదారిత ప్రాంతం కావడంతో… అటు బిక్కేరు వాగు.. ఇటు మూసి నది ఉదృతంగా ప్రవహిస్తుండడంతో ఆయకట్టు రైతులకు సాగునీటికి ఎలాంటి వానాకాలం ,యాసంగి పంటలకు కొరతలేదని రైతులు అభిప్రాయపడుతున్నారు.మరో 2,3 రోజులు వరద నీరు బృందావన్ కాల్వ ద్వారా ప్రవాహం కొనసాగితే పెద్ద చెరువు అలుగు పొసే అవకాశం ఉంది.ఇప్పటికే జామచెట్లబావి వద్ద ఉత్తరాది చెరువు అలుగు పోస్తుంది.మోత్కూర్ పెద్ద చెరువు ఆయకట్టు 270 ఎకరాలు,బిక్కేరు వాగు ఆయకట్టు 750 ఎకరాలు,మూసి నది ఆయకట్టు 100 ఎకరాల్లో 2 పంటలకు వరి పంట సాగుకు అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement