Saturday, April 27, 2024

రైతుబంధు పథకం ప్రపంచానికే మార్గదర్శి

ముఖ్యమంత్రి  కేసీఆర్ చేపట్టిన రైతు బంధు పథకం చాలా విశిష్టమైనదని,  ప్రపంచానికి ఒక మార్గం చూపిందని రాష్ట్ర వ్యవసాయ శాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామంలోని రైతు వేదిక భవనంలో  రైతుబంధు వారోత్సవ సంబురాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన రైతుబంధు పెట్టుబడి పథకం ప్రపంచానికే ఒక మార్గదర్శిగా మారిందని అన్నారు. ఈనెల 4 నుండి 10వ తేదీ వరకు జరుగుతున్న రైతుబంధు వారోత్సవ సంబరాలలో  రైతులు పెద్దఎత్తున ఉత్సాహంగా పాల్గొంటున్నారని చెప్పారు. రైతు కోసం 2018 ఆగస్టు నుండి రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 65 లక్షల మంది రైతులకు, ఒక కోటి 45 లక్షల ఎకరాలకు రైతుబంధు పెట్టుబడి అందిస్తున్నామని చెప్పారు. 92 శాతం ఉన్న ఐదు ఎకరాల లోపు సన్న చిన్నకారు రైతులకు భరోసాగా రైతుబంధు నిలిచిందని తెలిపారు.

రైతు బంధు పథకం కింద రూ. 50 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలోకి నేరుగా జమ చేశామన్నారు. ఒక గుంట భూమి ఉన్న రైతుకు కూడా పెట్టుబడి అందిస్తున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. దేశంలో గత 70 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఆరుగాలం కష్టపడే రైతులకు నేరుగా పెట్టుబడి ఇచ్చిన మహానుభావుడు, రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని మంత్రి చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో  గత నాలుగేళ్ల నుండి ఎనిమిది సీజన్లలో రైతాంగానికి రూ. 1,968 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశామని వివరించారు. రాష్ట్రంలో 30 లక్షల మోటార్ బావులు ఉన్నాయని, ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్లు కరెంట్ సబ్సిడీ కింద  కడుతున్నామన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం ప్రతి సంవత్సరం సగటున రూ. 25 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు.

దేశంలో అతి పెద్ద రాష్ట్రం అయిన ఉత్తరప్రదేశ్ లో రైతులు ఆయిల్ ఇంజన్ మోటార్ల మీదే ఆధారపడ్డారని, కానీ తెలంగాణలో రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నామన్నారు. సంక్రాంతి సందర్భంగా రైతులు ధాన్యపు రాశులతో ముగ్గులు వేస్తున్నారన్నారు. రైతులు వేసిన పంటలలో రైతు జీవన విధానంలో సీఎం కేసీఆర్ స్పష్టంగా కనిపిస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలో 51 రకాల వ్యవసాయ ఉత్పత్తులో వరి ఒక పంట మాత్రమేనని,  ఇది రైతాంగం గుర్తించి మిగతా పంటలు వేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. వ్యవసాయ శాఖ అధికారుల సూచనలతో ఇతర పంటలతో అద్భుతాలు సాధించాలని కోరారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement