Saturday, May 4, 2024

అఫిలియేషన్‌ లేకుండానే నిర్వహణ.. రూల్స్ పాటించ‌ని కాలేజీలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఇంటర్‌ కాలేజీల గుర్తింపు విషయంలో ప్రతి ఏటా ఇదే తంతు నడుస్తోంది. చివరి వరకూ గుర్తింపు ఇవ్వకుండా ఆపడం…విద్యార్థుల భవిష్యత్‌ దృష్ట్యా అంటూ చివరకు అనుమతులివ్వడం పరిపాటిగా మారింది. దాదాపు నాలుగైదేళ్ల నుంచి ప్రతి ఏటా నిబంధనలను తప్పుతున్నాగానీ ఇంటర్‌ బోర్డ్‌ మాత్రం నిబంధనలు పాటించని కాలేజీలపై చర్యలు తీసుకోవడంలో వెనుకాడుతున్నదనే విమర్శులు వినిపిస్తున్నాయి. అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాకముందే గుర్తింపు పొందిన కాలేజీల వివరాలను ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌లో పెట్టాలి. అప్పుడు ఏ కాలేజీకు అనుమతి ఉన్నది..లేనిది చూసుకున్న విద్యార్థులు తమకు నచ్చిన కాలేజీల్లో అడ్మిషన్లు పొందుతారు.

కానీ దీనికి పూర్తి భిన్నంగా వాస్తవ పరిస్థితి నడుస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు పూర్తవుతున్నా ఇంత వరకూ ఇంకా ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల అఫిలియేషన్‌ ప్రక్రియే పూర్తి కాలేదు. రాష్ట్రంలో 1582 ప్రైవేట్‌ కాలేజీలు అఫిలియేషన్‌ (అనుబంధ గుర్తింపు) కోసం ఇంటర్‌ బోర్డుకు దరఖాస్తు చేసుకుంటే అందులో ఇప్పటి వరకు 786 కాలేజీలు మాత్రమే గుర్తింపు పొందాయి. మిగిలిన 584 కాలేజీలకు ఇంకా గుర్తింపే తీసుకోలేదు. సరైనా ధ్రువపత్రాలు సమర్పించకపోవడంతోనే వీటికి గుర్తింపు ఇవ్వలేదనే బోర్డు అధికారులు చెప్తున్నారు. త్వరగా సబ్మిట్‌ చేయాలని కాలేజీలకు నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. వాటిలో 457 కాలేజీలు మిక్స్‌డ్‌ ఆక్యుపెన్సీ కాలేజీలు ఉన్నాయి. ఫైర్‌ఎన్‌వోసి ఇతర ధ్రువపత్రాలను ఈ కాలేజీలు ఇంత వరకు సమర్పించలేదు. దీనికి సంబంధించిన ఫైలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు.

ప్రతీ సారి ఇంతే…

కాలేజీల అనుబంధ గుర్తింపు విషయంలో ప్రతి సారి అధికారులు చూసిచూడనట్లే వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు 786 కాలేజీలకు గుర్తింపు ఉంది. 584 కాలేజీలకు గుర్తింపు లేకపోగా అందులోనూ 457 కాలేజీలకు మిక్స్‌డ్‌ ఆక్యుపెన్సీలో ఉన్నాయి. గత విద్యా సంవత్సరం కూడా మిక్స్‌డ్‌ ఆక్యుపెన్సీ కారణంగా పలు కాలేజీలకు చివరి నిమిషంలో మినహాయింపునిస్తూ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఫైర్‌ ఎన్‌వోసీ లేని కాలేజీలకు గుర్తింపు ఇవ్వొద్దని విద్యాశాఖకు గతంలో ప్రభుత్వం ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. అయినా వాటిని పట్టించుకోకుండా దాదాపు నాలుగైదేండ్లుగా బోర్డు అనుమతులిస్తూ పోతోంది.

మిక్స్‌డ్‌ ఆక్యుపెన్సీ కేటగిరీలో ఉన్న కాలేజీల్లో ప్రముఖ కాలేజీలు ఉన్నట్లు సమాచారం. జూన్‌ 1 నుంచి కాలేజీలు స్టార్ట్‌ అవుతాయి. అప్పటికే కాలేజీలకు అఫిలియేషన్‌ ఇచ్చి గుర్తింపులేని కాలేజీల లిస్టు ప్రకటించాలి. కానీ దీన్ని ఇంటర్‌ బోర్డు అధికారులు పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతిలేని కాలేజీల్లో లక్షన్నరకు పైగా విద్యార్థులు ఇప్పటికే అడ్మిషన్లు పొంది చదువుతున్నారు కూడా. ఒకవేళ ఈ కాలేజీలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకుంటే వారి పరిస్థితి అగమ్యగోచరమే అంటున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement