Saturday, May 4, 2024

కరోనా కట్టడికి ఇదే మార్గం..

వికారాబాద్‌ : కరోనా రెండో దశ విజృంభిస్తోంది. పొరుగు రాష్ట్రాలు కరోనా విజృంభనతో అల్లాడిపోతున్నాయి. దేశంలో రెండో దశ కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రారంభమైందని కేంద్రం ప్రకటించింది. అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆదేశించింది. రాష్ట్రంలో కూడా కరోనా వైరస్‌ వ్యాప్తి అధికమైంది. ప్రభుత్వం కూడా కరోనా కట్టడికి..వైరస్‌ వ్యాప్తి జరగకుండా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కరోనా టీకాల పంపిణీని వేగవంతం చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న టీకా పంపిణీ కేంద్రాలను పెంచాలని నిర్ణయించారు. ప్రైవేటులో కూడా టీకాలను పంపిణీ చేయించాలని యోచిస్తోంది.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కోవిడ్‌ టీకాల పంపిణీ జరుగుతోంది. టీకాల పంపిణీకి సంబంధించి కేంద్రం ఎప్పటికప్పుడు మార్గదర్శకాలను జారీ చేస్తోంది. ప్రస్తుతం 45 ఏళ్ల పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి టీకాలను పంపిణీ చేస్తున్నారు. ఏప్రిల్‌ మొదటి నుంచి దేశవ్యాప్తంగా 45 ఏళ్ల ఉన్న వారు ఎవరైనా టీకాలను వేయించుకోవచ్చు అని కేంద్రం పేర్కొంది. ఇక కరోనా యోధులకు వయస్సుతో నిమిత్తం లేకుండా టీకాల పంపిణీ పూర్తి చేశారు. కేంద్రం కూడా టీకాల పంపిణీకి విశేష ప్రాధాన్యం ఇస్తోంది.

జిల్లాలో కోవిడ్‌ టీకాల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పది కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 15,090 మందికి కోవిడ్‌ టీకాలు వేశారు. ప్రతిరోజు ఒక్కో కేంద్రంలో 100 నుంచి 200 మందికి టీకాలు వేస్తున్నారు. మొన్నటి వరకు టీకాలు వేయించుకునేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపించలేదు. గత వారం పది రోజులుగా కోవిడ్‌ టీకాలు వేయించుకునేందుకు ఆయా వర్గాలకు చెందిన ప్రజలు ముందుకు వస్తున్నారు. దీంతో జిల్లాలో టీకాల పంపిణీ వేగం పుంజుకుంది. కరోనా రెండో దశ ప్రారంభం కావడంతో ప్రతిరోజు టీకాల పంపిణీ కేంద్రాల వద్దకు ప్రజలు పరుగులు తీస్తున్నారు జిల్లాలో 45 ఏళ్ల పైబడిన దాదాపు 4,500 మందికి కోవిడ్‌ టీకాలను పంపిణీ చేశారు. జిల్లాలో కోవిడ్‌ టీకాల పంపిణీ పూర్తి నెమ్మదిగా సాగుతోంది. టీకాలను తీసుకునేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కోవిడ్‌ రెండో దశ ప్రారంభమైందనే ప్రచారం సాగడం.. ప్రభుత్వం కూడా విద్యా సంస్థలను మూసివేయడంతో టీకాల కొరకు ప్రజలు పరుగులు తీస్తున్నారు.

కోవిడ్‌ రెండో దశ మరింతగా విజృంభించకముందే టీకాల పంపిణీ వేగం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా టీకాల పంపిణీ కేంద్రాలను రెండింతలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ప్రభుత్వ కేంద్రాలలోనే టీకాల పంపిణీ జరుగుతోంది. ఇక నుంచి ప్రైవేటు ఆసుపత్రులలో కూడా టీకాల పంపిణీ ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నిర్ణయం అమలులోకి వచ్చిన తరువాత ఎంపిక చేసిన ప్రైవేటు ఆసుపత్రులలో కూడా కోవిడ్‌ టీకాలను పంపిణీ చేస్తారు. ప్రస్తుతం రోజువారిగా జిల్లాలో ఇస్తున్న టీకాల పంపిణీని రెండింతలు చేసి కోవిడ్‌ వైరస్‌ బారిన పడే అవకాశం ఉన్న వారికి మొదట ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement