Sunday, May 12, 2024

మూడు ఇళ్ళలో భారీ చోరి

జడ్చర్ల : పట్టణ నడి బొడ్డులో ఒకటి కాదు , రెండు కాదు ఏకంగా మూడు ఇండ్లలో భారీ చోరికి తెగబడిన దొంగలు జడ్చర్ల పోలీసులకు సవాల్‌ విసిరారు. వివరాల్లోకి వెళ్తే స్థానిక నేతాజీ చౌరస్తా సమీపంలో నివాసం ఉంటున్న మిర్యాల వేణుగోపాల్‌ అనే వ్యాపారి కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం 21వ తేదిన హైద్రాబాద్‌కి వెళ్లారు. తిరిగి మంగళవారం రాత్రి11 గంటల సమయంలో ఇంటికి రాగా ఇంటితాళం తీసి ఉండటంతో చూసి పోలీసులకు సమాచారం అందించారు. కాగా బాధితుడు వేణుగోపాల్‌ ఇంట్లో దొంగలు దాదాపు 50 తులాల బంగారం , ఒక కిలో వెండి , రూ. 5 లక్షల నగదును ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఇదిలా ఉండగా స్థానిక తాలుకా క్లబ్‌ రోడ్డు రిటైర్డ్‌ టీచర్‌ కనకప్ప కుటుంబ సభ్యులతో కలిసి కోస్గిలో ఫంక్షన్‌ ఉండగా సోమవారం వెళ్లారు. తిరిగి బుధవారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా తాళాలు విరగ్గొట్టి ఉండటంతో లోపలికి వెళ్లి చూడగా బీరువాలో ఉంచిన 10 తులాల బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా అదే రోజు స్థానిక శ్రీనివాస కాలనీలో రాజప్ప అనే టీచర్‌ ఇంట్లో కూడా దొంగలు పడి 5 తులాల వెండి , 2 వేల నగదును ఎత్తుకెళ్లినట్లు బాధితులు చెప్పారు.
సంఘటనా స్థలానికి క్లూస్‌ టీం ..
పట్టణంలో ఒకే రోజు భారీగా ఇండ్లను దొంగలు దోచుకెళ్లడంతో సిఐ వీరస్వామి , ఎస్‌ఐ జయప్రసాద్‌ లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం క్లూస్‌ టీంను పిలిపించి ఆధారాలు చేపట్టే పనిలో పడ్డారు .
నిద్రావస్థలో పోలీసులు ..
పట్టణంలో ఒకే రోజు మూడు ఇండ్లలో చోరీలు జరగడం , పెద్ద మొత్తంలో బంగారం , వెండి , నగదు ఎత్తుకెళ్లడంతో ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. కానీ గత నెలలో కూడా వరుసగా శ్రీనివాస నగర్‌ కాలనీలో తాళం వేసిన ఇండ్లలో చోరీలు జరగడంతో పాటు పెద్దగా వస్తువులు పోకపోవడంతో ఒకరు మాత్రమే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. వరుసగా చోరీలు జరుగుతున్న దొంగలు ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్న పోలీసులు మాత్రం పెట్రోలింగ్‌ పెంచకపోవడం , అర్థరాత్రులు రోడ్లమీద తిరుగుతున్న వారిని అనుమానించకపోవడం చూస్తుంటే వారు ఇంకా నిద్రావస్థలో నుంచి తేరుకున్నట్లు లేదని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు పట్టణంలో పెట్రోలింగ్‌ పెంచి దొంగల బెడద నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
ఫిర్యాదులు పరిష్కరిస్తున్నాం: సిఐ వీరస్వామి
మంగళవారం పట్టణంలో మూడు ఇండ్లలో చోరీలు జరిగిన మాట వాస్తవం. కానీ ఇంత సొత్తు పోయిందనేది ఇంకా పూర్తిగా తెలియలేదు. ఫిర్యాదుదారులు అన్ని పరిశీలించుకున్నాక లిఖిత పూర్వకంగా ఫిర్యాదు అందిన తర్వాత ఎంత సొమ్ము పోయిందో తెలుస్తుందని , ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం. త్వరలోనే నిందితులను పట్టుకుంటాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement