Tuesday, May 14, 2024

జాతీయ రహదారిగా గుర్తించండి..

మహబూబ్‌న‌గ‌ర్ : ఢిల్లీలో జాతీయ రహదారుల కార్యదర్శి గిరిధర్ కు ఎంపీ పోతుగంటి రాములు వినతి పత్రం ఇచ్చారు. మహబూబ్‌న‌గ‌ర్ జిల్లా పరిధిలోని భూత్పూర్ నుండి నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ వరకు ఉన్న రాష్ట్ర ర‌హ‌దారిని జాతీయ రహదారిగా గుర్తించి కావాల్సిన నిధులు మంజూరు చేసి అభివృద్ధి పరచాలని పోతుగంటి రాములు కోరారు. ఎన్‌హెచ్‌-67 నుండి ఎన్‌హెచ్‌-765, ఎన్‌హెచ్‌-44ల మీదుగా భూత్పూర్ నుండి నాగర్ కర్నూల్-అచ్చంపేట-అమ్రాబాద్ (బిజినపల్లి – నాగర్ కర్నూల్-తెలకపల్లి-అచ్చంపేట-మనన్నుర్) వరకు 100 కిలోమీటర్ల మేర స్టేట్ హైవేను జాతీయ రహదారిగా గుర్తించాలని కోరారు. ఈ ర‌హ‌దారిని జాతీయ రహదారిగా అభివృద్ధి చేస్తే నాగర్ కర్నూల్ జిల్లాతో పాటు ఉమ్మడి జిల్లాకు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా ఉంటుందని పేర్కొన్నారు. జాతీయ రహదారుల నిర్మాణంతో వెనుకబడిన తన పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందని తెలిపారు. తక్షణమే కావాల్సిన నిధులు మంజూరు చేసి సహకరించాలని ఎంపీ ఈ సంద‌ర్భంగా కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement