Monday, May 20, 2024

ఘనంగా ఖమ్మం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వార్షికోత్సవం

ఖమ్మం, ఆంధ్రప్రభ :  విద్యార్థులు తమకు లభించిన అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఖమ్మం పట్టణ మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి పిలుపునిచ్చారు. ఖమ్మం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పద్మావతి, అధ్యాపక బృందం ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. కోవిడ్ 19 కారణంగా ఆన్‌లైన్ క్లాసులకే పరిమితమైన విద్యార్థులు ఆఫ్‌లైన్‌లో పరీక్షలను ఎదుర్కోవడానికి ఇబ్బంది పడుతున్నారని గ్రహించిన ప్రిన్సిపల్, అధ్యాపకులు వార్షికోత్సవాన్ని సరైన వేదికగా ఎంచుకున్నారు. విద్యార్థులకు క్రీడా, సాహిత్య, సాంస్కృతిక  పోటీలు నిర్వహించారు. కళాశాల పూర్వ అధ్యాపకులు, పట్టణంలోని విద్యా, వ్యాపారవేత్తలు ఇచ్చిన విరాళాలతో వివిధ కోర్సులు, వివిధ అంశాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. వార్షికోత్సవ సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రిన్సిపల్ పద్మావతి కళాశాల విద్యార్థులు గత రెండేళ్లుగా సాధించిన విజయాలు, ఉన్నత విద్యకుగానూ పొందిన ర్యాంకులపై వార్షిక నివేదికను సమర్పించారు.

నూతన విద్యా సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా ప్రత్యేక అతిథిగా హాజరైన ఆదర్శ్ సురభి చేతుల మీదుగా మహిళా డిగ్రీ కళాశాల పోస్టర్‌ను విడుదల చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల భవన సముదాయం ఎంతో ఆహ్లాదకరమైన ప్రకృతి మధ్య ఉండడం విద్యార్థుల అదృష్టమన్నారు. అనంతరం గాంధీచౌక్ మున్సిపల్ కార్పొరేటర్(37వ వార్డ్) పసుమర్తి రామ్మోహన్ మాట్లాడుతూ… మహిళా కళాశాలకు తన వంతు సంపూర్ణ సహాయ సహకారాలు అందజేస్తానని హామీ ఇచ్చారు. సమాజంలో నైతిక విలువలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత విద్యార్థులదేనని విశ్రాంత అధ్యాపకులు కె.వి.నరసింహారావు దిశానిర్దేశం చేశారు. కళాశాల విద్య జాయింట్ డైరెక్టర్ రాజేంద్ర సింగ్  అకడమిక్ సెల్, ఏజీవో తిరువెంగళాచారి కాలేజీని సందర్శించి సివిల్ సర్వీసెస్ వైపు దృష్టి పెట్టాలంటూ విద్యార్థులను ఉత్తేజపరిచారు. వార్షికోత్సం సందర్బంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement