Saturday, November 2, 2024

Khammam: ఎప్పుడూ మాదిగలకు అన్యాయమే.. ఈసారైనా 15సీట్లు కేటాయించండి… కాంగ్రెస్ కు మాదిగల వినతి

ఖమ్మం, ఆగస్టు 29 : 45 ఏళ్లుగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో మాదిగలకు అన్యాయం జరుగుతోందని, ఈసారైనా 15సీట్లు కేటాయించాలని తెలంగాణ మాదిగ రాజకీయ పోరాట వేదిక కన్వీనర్ వక్కలగడ్డ సోమ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఖమ్మంలోని ప్రెస్ క్లబ్ లో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు 12శాతం, ఖమ్మం జిల్లాలో దళితుల్లో 75 శాతం మంది ఉన్నారన్నారు. అయిననూ 25 శాతం ఉన్న మాలలకు సత్తుపల్లి, జిల్లాలో వెయ్యి ఓట్లు కూడా లేని మాల దాసరి వారికి మధిర సీటును కేటాయించడం వల్ల జిల్లాలో మాదిగలకు అన్యాయం జరుగుతోందన్నారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో మాదిగలు గెలుపోటములను ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉన్నారన్నారు.

అయినా గత 45 ఏళ్లుగా మాదిగలకు జిల్లాలో సీటు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారైనా జనాభా దామాషా ప్రకారం రెండు సీట్లను మాదిగలకు కేటాయించాలన్నారు. మధిరలో మాదిగలు 50 వేలు, సత్తుపల్లిలో 45 వేల మంది ఉన్నారని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే మాదిగలు అత్యధిక శాతం ఉన్న నియోజకవర్గం మధిర అని తెలిపారు. అటువంటి చోట మాదిగ సామాజిక వర్గానికి సీటు కేటాయించకపోవడం మాదిగల ఆత్మగౌరవాన్ని కించపరిచినట్లుగా ఉందన్నారు. చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ లో పొందుపరిచి నట్లుగా జనాభా దామాషా ప్రకారం మాదిగలకు 15 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పోరాట వేదిక సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement