Thursday, May 2, 2024

దళిత బంధు కోసం ప‌కడ్బందీ చ‌ర్య‌లు : మంత్రి పువ్వాడ అజ‌య్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు అమలు చేసేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కోన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలంను ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన సందర్భంగా దళిత బంధు పూర్తి స్థాయిలో అమలుపై ఖమ్మం గట్టయ్య సెంటర్ లోని డీపీఆర్సీ భవన్ నందు ప్రజా ప్రతినిధులు, ప్రత్యేక అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ తాతా మధు, జిల్లా కలెక్టర్ వీపీ గౌతం, మున్సిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, జ‌డ్పీ చైర్మన్ కమల్ రాజ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈసంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ… ప్రతి దళిత కుటుంబం ఆర్ధిక పురోగాభివృద్ది సాధించాలనే ఆకాంక్షతో ప్రభుత్వం ఈ పథకం రూపకల్పన చేసిందని వివరించారు. ఎవరు ఏ యూనిట్ ఏర్పాటు చేసుకోవాల‌న్నా ఎలాటి అభ్యంతరం లేదన్నారు. అయితే పెట్టే యూనిట్ పై అనుభవముంటే బావుంటుందని సూచించారు.

అందరూ ఒకే తరహా యూనిట్ లు కాకుండా వివిధ రంగాలను ఎంపిక చేసుకుని, వాటిలో కలిగే ఇబ్బందులు, ప్రయోజనాలు చెప్పాల్సిన బాధ్యత ప్రత్యేక అధికారులు చూసుకోవాల‌న్నారు. చింతకాని మండలంలోని 25 గ్రామాల్లో పూర్తి స్థాయిలో అందరికీ అందిస్తామన్నారు. సమగ్రత కుటుంబ సర్వే ద్వారా వెరిఫై చేసిన ఆధారంగా ఉన్న ప్రతి దళిత కుటుంబానికి ఈ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ (రేషన్ కార్డు), ఆధార్ కార్డు ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఎక్కడ ఎలాంటి అవకతవకలు జరగకుండా, ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకం వర్తింపజేసేందుకే ప్రతి గ్రామానికి ప్రత్యేక అధికారిని నియమించినట్టు చెప్పారు. ఏదైనా మంచి పని చేసినప్పుడు కొన్ని దుష్ట శక్తులు వస్తూనే ఉంటాయన్నారు. చేస్తున్న పని ప్రజలకు ఉపయోగపడేది అయినపుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. అనంతరం ఆయా స్పెషల్ ఆఫీసర్ల‌ నుండి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement