Thursday, May 2, 2024

చాకలి ఐలమ్మ పోరాట పటిమ స్ఫూర్తిదాయకం : ఎమ్మెల్యే దాసరి

భూమి, భుక్తి కోసం, సాయుధ రైతాంగ పోరాటంలో వీరనారి చాకలి ఐలమ్మ ప్రదర్శించిన పోరాట పటిమ స్ఫూర్తి దాయకం అని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణతో కలసి నివాళులర్పించారు. సమాజ హితం కొరకు, ప్రజలు గురవుతున్న ఇబ్బందులకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుల స్ఫూర్తి, వారి త్యాగాలు, గొప్పతనం ప్రజలకు తెలిసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహనీయుల జయంతిని అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యసాహసాలు, ప్రజాస్వామిక పోరాటాలు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని అన్నారు. భారతదేశానికి 1947లో స్వాతంత్ర్యం లభిస్తే తెలంగాణ ప్రాంతం 1948లో భారత దేశంలో విలీనమైందని, ఆనాటి సాయుధ భూ పోరాటానికి చాకలి ఐలమ్మ స్పూర్తి అందించిందన్నారు.
పేదరికంలో ఉన్న మహిళ 85 సంవత్సరాల క్రితం సమాజంలో జరుగుతున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి మనందరికీ స్ఫూర్తిగా నిలిచారన్నారు. ప్రభుత్వం అధికారికంగా మహనీయుల జయంతి ఉత్సవాలు జరుపుతున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. రజకులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తుందని, రుణాలు అందిస్తున్నదని తెలిపారు. వీటితోపాటు గ్రామీణ ప్రాంతాలలో అవసరమైన చోట దోబీ ఘాట్ల నిర్మాణం చేయాలని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి స్వయం ఉపాధి అవకాశాలు పూర్తి సబ్సిడీతో అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జెడ్పీటీసీ రాంమూర్తి, జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి రంగా రెడ్డి, డి.డబ్ల్యూ.ఓ. రౌఫ్ ఖాన్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీధర్, జడ్పీ సీఈఓ శ్రీనివాస్, డి.పి. ఓ. చంద్రమౌళి, డి.ఈ.ఓ. మాధవి, వ్యవసాయ శాఖ అధికారి ఆడి రెడ్డి, జిల్లా అటవీ అధికారి శివయ్య, జిల్లా ఉపాధి అధికారి తిరుపతి రావు, ఇతర జిల్లా అధికారులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement