Friday, May 3, 2024

అబ్బుర పరిచే సోయగం.. రాయికల్‌ జలపాతం

సైదాపూర్ :శుక్రవారం రాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో 16.03 మి.మీటర్ల వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. వర్షానికి సైదాపూర్ మండలం రాయికల్ జలపాతం చూపరులను కనువిందు చేస్తుంది. ఎడతెరిపి లేకుండా వర్షం దీనికి తోడు ఈరోజు రెండో శనివారం సెలవు దినం కావడంతో రాయికల్ జలపాతం అందాలను చూస్తూ పర్యటకులు, గుట్టపై నుండి వచ్చే జలపాతంలో స్నానాలు చేస్తూ, కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. జలపాతం అందాలను చూసేందుకు సందర్శకుల తాకిడి ఎక్కువైంది.ప్రకృతి అందాలను పిల్లలు,పెద్దలు అనే తేడాలు లేకుండా చూస్తు రెండు గుట్టల మీద నుండి వస్తున్న వర్షపు నీరు సవ్వడిగా వస్తుండటంతో సంబరపడుతున్నారు. వర్షం పడిన తర్వాత రెండు గుట్టల మధ్య వస్తున్న సెలయేరు జలపాతంగా ఏర్పడడంతో అందులో మునుగుతూ సెల్ఫీలు, ఫోటోలకు ఫొజులిస్తున్నారు. జలపాతంకు వెళ్లేదారి గుంతలమయమై పోవడంతో టూవీలర్, ఫోర్ వీలర్ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దారి బాగు చేస్తే సందర్శకుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉందని వెన్కేపల్లి – సైదాపూర్ విశాల వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్ చాడ ప్రకాశ్ రెడ్డి కోరుతున్నారు. ఇట్టి విషయంపై స్థానిక సర్పంచ్ కేడిక మధూకర్ రెడ్డిని ఆంధ్రప్రభ వివరణ కోరగా జలపాతంను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరుతూ, ప్రభుత్వం నుండి ప్రత్యేక నిధులు మంజూరు చేస్తే మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.

కరీంనగర్ జిల్లాకే ఆదర్శం:
కరీంనగర్ జిల్లాలో ఎక్కడ లేని విధంగా సైదాపూర్ మండలం రాయికల్ గ్రామంలో జలపాతం ఉందని ఇది కరీంనగర్ జిల్లాకే ఆదర్శం కావాలని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించి రాయికల్ జలపాతంను పర్యాటక కేంద్రంగా గుర్తించి నిధులు కేటాయించాలని, సందర్శకుల పడుతున్న ఇబ్బందులు పరిష్కరించాలని రైతు సంఘం మండల కార్యదర్శి గుండేటి వాసుదేవ్ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement