Friday, April 26, 2024

Karimnagar: అపోలో రిచ్ ఆస్పత్రిలో అరుదైన చికిత్స‌.. మోకాలి చిప్ప మార్పిడి స‌క్సెస్‌

కరీంనగర్ (ప్రభ న్యూస్) : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అపోలో రీచ్ ఆసుపత్రిలో డాక్ట‌ర్లు ఆరుదైన మోకాలి చిప్ప మార్పిడి చేశారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన కోలకొండ పద్మ రెండు మోకాళ్ళ చిప్పలు అరిగిపోవడంతో ఏడాది క్రితం హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో మార్పిడి చేసుకుంది. ఈనెల 14న ప్రమాదవశాత్తు జారి పడటంతో కుడి మోకాలిలో అమర్చిన ఇంప్లాంట్ పూర్తిగా విరిగిపోవడంతో నడవ లేకుండా పోయింది. పలు ఆస్పత్రులకు వెల్లినా మరోసారి చిప్ప మార్పిడి సాధ్యం కాదని తేల్చి చెప్పడంతో చివరి ప్రయత్నంగా అపోలో రీచ్ ఆసుపత్రిలో మోకాలి చిప్ప మార్పిడి నిపుణులు డాక్టర్ వెంకట్ రెడ్డిని సంప్రదించారు.

పరీక్షలు నిర్వహించిన అనంతరం వైద్యులు వెంకట్ రెడ్డి పద్మకు శస్త్ర చికిత్స నిర్వహించి పనికి రాకుండా పోయిన మోకాలి చిప్ప స్థానంలో మరో ఇంప్లాంట్ అమర్చారు. చిప్ప అమర్చిన అనంతరం పద్మ యధావిధిగా నడిచింది. పద్మ బంధువులు డాక్టర్ వెంకట్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా అపోలో రీచ్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ ప్రమోద గుప్త మాట్లాడుతూ ఇలాంటి శస్త్ర చికిత్సలు చాలా అరుదుగా జరుగుతాయని, అలాంటిది రెండవ తరహా పట్టణం అయినా కరీంనగర్ లో అరుదైన శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేయడం సంతోషంగా ఉందన్నారు. శస్త్ర చికిత్స విజయవంతంగా చేసి నడవలేని స్థితిలో ఉన్న పద్మను తిరిగి నడిపించిన డాక్టర్ వెంకట్ రెడ్డిని అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement