Monday, May 13, 2024

కుక్క‌ను కొట్టి చంపిన ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు

క‌రీంన‌గ‌ర్ : మూగజీవాల సంరక్షణ పట్ల తమకున్న బాధ్యతను మరోసారి చాటారు కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ కొత్తపల్లి మండల కేంద్రంలో శునకాన్ని కర్రలతో కొట్టి హింసించి హతమార్చిన సంఘటనపై కేసు నమోదు చేయించారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తపల్లి మండల కేంద్రంలోని సంగెం చౌరస్తాలో ఈ నెల 15వ తేదీన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు శునకాన్ని కర్రలతో చితకబాదారు. ఈ సంఘటనలో సదరు శునకం మృతి చెందింది. ఈ సమాచారం అందుకున్న హైదరాబాద్ నల్లకుంట ప్రాంతానికి చెందిన జంతు సంరక్షణ సంస్థ వ్యవస్థాపకులు పృద్వి పన్నీరు కొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ మాజీ కేంద్ర మంత్రి, సంజయ్ గాంధీ జంతు సంరక్షణ కేంద్రం వ్యవస్థాపకురాలు మేనకా గాంధీకి సమాచారం అందించారు. మాజీ ఎంపీ మేనకా గాంధీ స్పందిస్తూ శుక్రవారం రాత్రి పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణతో మాట్లాడి దృష్టికి తీసుకువచ్చారు. ఈ మేరకు తగు చర్య నిమిత్తం కొత్తపల్లి ఎస్ఐని ఆదేశించారు. విచారణ జరిపిన పోలీసులు ఈ సంఘటనపై శుక్రవారం రాత్రి కేసు నమోదు చేశారు. గతంలో పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణ పిల్లి బావిలో పడిన సంఘటనపై స్పందిస్తూ దాని రక్షణకు చర్యలు తీసుకున్న విషయం విధితమే. తాజాగా శునకాన్ని చిత్రహింసలకు గురిచేసి హతమార్చిన సంఘటనపై స్పందిస్తూ కేసు నమోదు చేయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement