Wednesday, May 8, 2024

రాష్ట్రంలో ‘జూట్‌’ మిల్లులు.. 887 కోట్ల పెట్టుబడుల‌తో గోనె సంచుల తయారీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ధాన్యం దిగుబడి పెరుగుతున్నా కొద్దీ అందుకు తగ్గట్లుగా అనుబంధ పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈక్రమంలోనే ఇటీవల నూకల నుంచి బయో ఇంధనం ఇథనాల్‌ తయారీకి పలు కంపెనీలతో ఒప్పందం చేసుకున్న ప్రభుత్వం తాజాగా ధాన్యం సరఫరా, నిల్వకు భారీ పరిమాణంలో అవసరమైన గోనె సంచులను కూడా స్థానికంగానే తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే గోనె సంచుల తయారుచేసే జూట్‌ మిల్లుల కంపెనీలతో పెట్టుబడుల విషయమై ఒప్పందాలు చేసుకుంది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం లాంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టులతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం రికార్డుస్థాయిలో పెరిగిన విషయం తెలిసిందే. దీంతో ఏటా ధాన్యం సేకరణకు రాష్ట్రంలో సుమారు 25 కోట్ల వరకు గోనె బస్తాలు అవసరం కాగా ప్రస్తుతం వీటిని పశ్చిమబెంగాల్‌, బీహార్‌ నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అయితే కొన్ని సందర్బాల్లో అక్కడి నుంచి గోనె బస్తాలను ఇంత ఎక్కువ పరిమాణంలో దిగుమతి చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ధాన్యం సేకరణ ఆలస్యమయ్యే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ సమస్యలన్నింటిని దృష్టిలో ఉంచుకుని గోనె సంచులను రాష్ట్రంలోనే ఉత్పత్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను ప్రభుత్వం 3 జూట్‌ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంది. గ్లోస్టర్‌ లిమిటెడ్‌, ఎంబీజీ కమాడిటీస్‌, కాళేశ్వరం ఆగ్రో కంపెనీలు రానున్న 18 నుంచి 24 నెలల్లో గోనె సంచుల ఉత్పత్తిని ప్రారంభించనున్నాయి.

ఈ మూడు కంపెనీలు రాష్ట్రంలో గోనె సంచుల తయారీకిగాను రూ.887 కోట్ల పెట్టుబడితో వరంగల్‌, సిరిసిల్ల, కామారెడ్డిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరిశ్రమలు స్థాపించనున్నట్లు పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. గోనె సంచుల తయారీకి ఈ కంపెనీలు పెట్టనున్న పెట్టుబడుల ద్వారా 10 వేల మందికిపైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయని పరిశ్రమల శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గోనె సంచుల తయారీకి ముందుకు వచ్చిన కంపెనీలకు ప్రోత్సాహకాలు కల్పించడమే కాకుండా వాటి ఉత్పత్తులను కూడా కొంతకాలం పాటు ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా కంపెనీలకు ప్రభుత్వంతో ఒప్పందం కుదిరినట్లు అధికారులు పేర్కొంటున్నారు. గోనె సంచుల తయారీకి అవసరమైన ముడి సరుకు కోసం రాష్ట్రంలో 25 వేల నుంచి 30 వేల ఎకరాల్లో జనుము పంట సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒప్పందం కదుర్చుకున్నీ మూడు మిల్లుల ద్వారా ఏటా 15 నుంచి 17 కోట్ల గోనె సంచులు ఉత్పత్తి అవుతాయని అంచనాలు వేస్తున్నారు. ఇవి కాకుండా మిగిలిన గోనె సంచుల లోటును భర్తీ చేయడానికి నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో కూడా పరిశ్రమల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. పశ్చిమబెంగాల్‌, బీహార్‌ రాష్ట్రాల్లోని కంపెఈలు మన రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో యూనిట్లు ఏర్పాటు చేసే విధంగా చర్చలు జరుపుతున్నారు. రాష్ట్ర అవసరాలను తీర్చడమే కాకుండా ఇతర ప్రాంతాలకు గోనె సంచులు ఎగుమతి చేసే దిశగా ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు అవసరమైన అనుకూల పరిస్థితులను ఏర్పరచాలని నిర్ణయించింది..

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement