Monday, April 29, 2024

లింగోజీగూడ డివిజ‌న్ ఉప ఎన్నిక‌కు టిఆర్ ఎస్ దూరం – కెటిఆర్…

హైదరాబాద్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని లింగోజిగూడ డివిజన్‌కు జరగనున్న ఉప ఎన్నికలో ఏకగ్రీవ ఎన్నిక కోసం బీజేపీ విజ్ఞప్తి మేరకు పోటీకి దూరంగా ఉండాలని టీర్‌ఎస్‌ నిర్ణయించింది. ఇటీవల జరిగిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్‌ నుంచి ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్‌ ఆకుల రమేష్‌ గౌడ్‌ ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే మృతి చెందారు. మినీ పురపోరులో భాగంగా ఈ డివిజన్‌కు ఏప్రిల్‌ 30న జరగనున్న ఉపఎన్నికలో రమేష్‌ గౌడ్‌ కుమారుడు పోటీ చేస్తున్నందున ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యేందుకు సహకరించాలని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలిసి విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ప్రమాణ స్వీకారం కూడా చేయకుముందే ఆకుల రమేష్‌ గౌడ్‌ మరణించడం దురదృష్టకరమని, రమేష్‌ అకాల మరణంవల్ల వచ్చిన ఈ ఎన్నికలో పోటీ పెట్టవద్దని బీజేపీ నుంచి వచ్చిన విజ్ఞప్తిని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లి వారి సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మానవతా దృక్పథంతో ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు తెరాస పార్టీ అధినేత కేసీఆర్‌కు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు బీజేపీ ప్రతినిధి బృందం, ఆకుల రమేష్‌ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే శ్రీదేవిరెడ్డి, సుధీర్‌రెడ్డి, ఆకుల రమేష్‌ గౌడ్‌ సతీమణి, కుమారుడు, ఇరు పార్టీల నేతలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement