Saturday, May 4, 2024

డిపో మేనేజర్‌తో సహా 10 మందికి కోవిడ్..

మంచిర్యాల : ఆర్టీసీ కార్మికులపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఆర్టీసీ డిపో మేనేజర్‌తో సహా 10 మంది సిబ్బందికి కరోనా సోకింది. గత మూడు రోజుల నుండి ఇప్పటికే ఇద్దరు డ్రైవర్లు కరోనా వ్యాధితో మృత్యువాతపడ్డారు. కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చడంతో ప్రయాణికుల సంఖ్య తగ్గి ఆర్టీసీ ఆదాయానికి గండి పడింది. మంచిర్యాల డిపో పరిధిలో 600 మంది సిబ్బంది పనిచేస్తుండగా కరోనా ప్రారంభం నుండి ఇప్పటి వరకు 64 మంది సిబ్బందికి కరోనా సోకింది. కోవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల మొదటి వారం నుండి సిబ్బంది టీకాను వేసుకుంటున్నారు. డిపో పరిధిలో 450 మందికి పైగా 45 సంవత్సరాల పైబడిన వారు ఉండటంతో వారికి ప్రత్యేకంగా వ్యాక్సినేషన్‌ వేయిస్తున్నారు. డిపోలో డీఎంతో పాటు ముగ్గురు సూపర్‌వైజర్లు, నలుగురు కండక్టర్లు, ముగ్గురు డ్రైవర్లు కరోనా బారీన పడి చికిత్స పొందుతున్నారు. మందమర్రికి చెందిన ఒక డ్రైవర్‌, మంచిర్యాలకు జిల్లా కేంద్రానికి చెందిన ఒక డ్రైవర్‌ గత మూడు రోజుల క్రితం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు డిపో అసిస్టెంట్‌ మేనేజర్‌ శ్రీలత పేర్కొన్నారు. మామూలు రోజుల్లో డిపో ఆదాయం ప్రతీరోజు రూ.18 లక్షల నుండి రూ.19 లక్షలు వస్తుండగా నేడు రూ.12లక్షల నుండి రూ.14లక్షల వరకే పరిమితమైంది. సుమారు రూ.5లక్షల ఆదాయానికి ప్రతీరోజు గండి పడుతున్నట్లు డిపో అధికారులు పేర్కొంటున్నారు. కరోనా ఉదృతి నేపథ్యంలో బస్సులను హైపోక్లోరైడ్‌ ద్రావణంతో శుభ్రపరుచుతున్నట్లు, సిబ్బందికి శానిటైజర్లను అందజేస్తున్నట్లు యాజమాన్యం పేర్కొంటున్నప్పటికీ కార్మికులు మాత్రం సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. కార్మికుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చూపుతోందని, దినదిన గండంగా అరకొర సిబ్బందితో పనిచేయాల్సి వస్తుందని వారు ఆరోపిస్తున్నారు. ఇకనైనా ఆర్టీసీ యాజమాన్యం ఆదాయంపై దృష్టి సారించకుండా కార్మికుల, ప్రయాణికుల ఆరోగ్యం పట్ల దృష్టి సారించి కరోనా బారీన పడకుండా బస్సులను శానిటైజేషన్‌ చేయడంతో పాటు సిబ్బందికి, ప్రయాణికులకు శానిటైజర్లను అందజేయాలని, సిబ్బందికి వ్యాక్సినేషన్‌ను అందజేయాలని వారు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement