Sunday, May 19, 2024

గ్రేట‌ర్ లో డొక్కు బ‌స్సులే దిక్కు.. బ‌స్తీలకు అస్సలే రాని బస్సులు

హైదరాబాద్‌, ప్రభన్యూస్‌ : కోటి జనాభా ఉన్న హైదరాబాద్‌లో ప్రజల అవసరాలు తీర్చడానికి కనీసం 6 వేల బస్సులు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే 2019 వరకు 3800 బస్సులు అందుబాటులో ఉండగా, అందులో కాలం చెల్లిన వెయ్యి బస్సులను స్క్రాప్‌ చేయడంతో ఉన్న వాటిలో మరింత తగ్గిపోవడంతో ప్రదాన రూట్లలో మినహా కాలనీలు, బస్తీలలో ఉంటున్న ప్రజల అవసరాలు తీర్చడానికి ఆర్టీసీ ముందుకు రాలేకపోతుంది. అంతే కాకుండా కొత్త బస్సులు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయని, విద్యుత్‌ బస్సుల కొనుగొలుకు కేంద్రం బడ్జేట్‌లో నిధులు ఇస్తుందనే ఆశ నిరాశగా మిగలడంతో గ్రేటర్‌ వాసులకు ఇక డొక్కు బస్సులే దిక్కని చెప్పక తప్పని పరిస్థితి నెలకొందని ఆర్టీసీ వర్గాలే అంటున్నాయి. గ్రేటర్‌ వాసులకు సరిపడా బస్సులు నడిపించలేక పోవడంతో జనం ప్రైవేట్‌ బస్సుల వెనుక పరుగులు పెడుతున్నారు. నగర రవాణాలో ఆర్టీసీ వాటా కేవలం 33 శాతం ఉండడంతో ప్రైవేట్‌ వాహన దారులు విచ్చలవిడిగా పెరిగిపోతున్నారు. ఏటా కొత్తగా రోడ్లపైకి లక్షల్లో వాహనాలు వస్తున్నాయి.

మరిన్ని బస్సులు స్క్రాప్‌కు..

ప్రస్తుతం ఉన్న 2800 బస్సులలో మరో 400 బస్సులు స్క్రాప్‌కు వెళ్తాయని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. దీనితో కొత్త బస్సులు అందుబాటులోకి రాక పోతే ప్రస్తుతం ఉన్న బస్సులు మరిన్ని తగ్గి 2400లకు చేరుకుంటాయి. వీటితో కేవలం సగంమంది ప్రయాణికులకే సేవలు అందించగలమని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. గ్రేటర్‌ పరిధిలో గత ఏడు సంవత్సరాల కాలంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా బస్సులు పెంచడం దెవుడెరుగు, ఉన్న వాటినే తగ్గించారనే విమర్శలు ఉన్నాయి. ప్రయాణికుల డిమాండ్‌కు సరిపడా బస్సులు అందుబాటులో లేకపోవడంతో పాత బస్సులకే రంగులు అద్దుతూ, కొత్త అందాలు తీసుకుని వచ్చి రోడ్లపైకి తీసుకుని వస్తున్నారు. కొత్త బస్సులకు బడ్జేట్‌ లేదంటు గతంలో ఆర్టీసీ 24 కోట్లతో 300 పాత బస్సులను మరమ్మత్తు చేసి రోడ్లపైకి తీసుకునివచ్చారు. నగరంలో భారీగా పెరిగిపోతున్న ట్రాపిక్‌ రూట్లలో పాత బస్సు లు మొరాయిస్తుండడంతో ఆర్టీసీ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంజన్లు పాతవి కావడంతో మరమ్మత్తులు ఎన్ని చేసినా అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఆర్టీసీని గట్టిక్కించాలంటే విద్యుత్‌ వాహనాలే శరణ్యం..

గ్రేటర్‌ ఆర్టీసీ రోజు రూ.కోటికి పైగా నష్టాలల్లోకి నెట్టివే యబడుతుంది. పెరుగుతున్న డీజిల్‌ వ్యయం భారీగా పెరుగుతుండడంతో యాజమాన్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటుంది. గ్రేటర్‌లో ప్రతి రోజు లక్షా 40 వేల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తారు. అయితే గత ఏడాది న్నర కాలంలో డీజిల్‌ ధరలు లీటర్‌కు రూ. 30 లు పెరగ డం ఆర్టీసీకి పెనుభారంగా మారింది. డీజిల్‌ ఖర్చులు తగ్గించడంతో పాటు, ప్రయాణికుల సంఖ్యను పెంచు కోవడం ద్వార ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నా లు చేస్తున్నారు. డీజిల్‌ ఖర్చులు తగ్గించుకోవాలంటే కనీ సం రెండు వేల విద్యుత్‌ బస్సులను తీసుకుంటు సాధ్యం కాదని నిపుణులు పేర్కోంటున్నారు. విద్యుత్‌ బస్సులను పెద్ద ఎత్తున తీసుకుని వస్తే తప్ప ఆర్టీసీ లాభాల బాటలోకి రాదని నిపుణులు అంటున్నారు. కొత్త ఎలక్ట్రికల్‌ బస్సులు రావాలంటే కేంద్ర ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలు నీరుగారాయి. ఇక మిగిలింది రాష్ట్ర బడ్జేట్‌పైనే ఆర్టీసీ కోటి ఆశలను పెట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ బస్సుల కొనుగోలుకు నిధులు ఇచ్చి సంస్థను కాపాడాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు కోరుతున్నాయి.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement